ధవళేశ్వరం-పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఆఫీస్ లో రికార్డులు దగ్ధం!

– సీఎం ఆదేశించినా తీరుమారని అధికారులు!
– ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం

రాజమహేంద్రవరం, మహానాడు: ధవళేశ్వరం-పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఆఫీస్ లో కొన్ని రికార్డులు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం హుటాహుటిన కలెక్టర్ కి, ఎస్పీకి సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అధికారిని, సిబ్బందిని విచారించి దగ్ధమైన ప్రదేశాన్ని, అక్కడ పడిన కొన్ని దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఇటీవల మదనపల్లిలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు.

గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కార్యాలయాల్లో పాతుకుపోయి ఉండడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, దీనిపై వెంటనే పూర్తి విచారణ చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రికార్డులు దగ్ధం చేయడానికి ఏవైనా అనుమతులు తీసుకున్నారా లేదా అనేదానిపై విచారణ చేయాలని, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని రికార్డులు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించాల్సి ఉందన్నారు. రికార్డులు దగ్ధం చేసిన స్వీపర్ అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ)రూరల్ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, పార్టీ కడియం మండల అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం, పండూరి అప్పారావు, పెన్నింటి ఏకబాబు, తలారి మూర్తి, ఆళ్ల ఆనందరావు, దొడ్డి బాబ్జి, నాళ్ల రమేష్, ఆళ్ల విటల్, కరణం రామారావు, కొడమంచిలి సూర్య, కింతాడ శివశంకర్, పలివేల వినోద్, తలారి రాజు, పోలిరెడ్డి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.