దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం!

– లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద కారు బోల్తా
– ఆస్పత్రికి తరలింపు
– చికిత్సకు సహకరించని మాధురి

పలాస: టెక్కలికి చెందిన దివ్వెల మాధురి జాతీయ రహదారిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం తనే కారు డ్రైవ్‌ చేసుకుంటూ పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ సమీపంలో ఆగి ఉన్న కారును ఢీ కొట్టారు. దీంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల సాయంతో ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వ్యవహారంలో ఆమె పేరు ఇటీవల చర్చనీయాంశమైంది.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తన భర్త మాధురితోనే ఉంటూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన భార్య, టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ఆరోపిస్తున్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మీడియాతో మాట్లాడుతూ.. మూడు రోజులుగా తనపై ట్రోల్‌ చేస్తున్న వార్తలకు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. డిప్రెషన్‌లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకునేందుకే ఇంటి నుంచి బయటకు వచ్చానని తెలిపారు.