-కమిటీలతో కాలయాపన తప్ప చిత్తశుద్ధి ఏదీ?
-ప్రత్యేక హోదా అడిగేందుకు ఇదే సరైన సమయం
-9, 10 షెడ్యూళ్లలో ఉన్న ఆస్తుల వివరాల గురించి మాట్లాడుకుని కొలిక్కి తీసుకురండి
-రూ.7 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రాబట్టేందుకు జగన్ కేంద్రం నుంచి ఆదేశాలు తీసుకొచ్చారు
-చంద్రబాబు జీవితంలో ఒక్కటైనా ఇలా సాధించారా?
-రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ముఖ్యమంత్రుల భేటీ
-మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజం
నెల్లూరు: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మన రాష్ట్రం పరువును తీసేలా వ్యవహరించారని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. విభజన సమస్యలపై కమిటీలతో కాలయాపన చేయడం తప్ప చిత్తశుద్ధి లేదని, రాష్ట్రానికి అన్యాయం జరిగేలా చంద్రబాబు తీరు ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందంటే సమాధానం చెప్పని మీరు, పోలవరం పూర్తి చేసే మాటటుంచి, మీ భేటీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
నిన్నటి సమావేశం తర్వాత మీడియాతో మంత్రులు మాట్లాడుతున్నప్పుడు అంత భయం భయంగా, బెరుకుగా తప్పించుకునే ధోరణిలో మాట్లాడారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయితే ప్రజలు చాలా ఆశించారన్నారు. అనేక సందర్భాల గురించి మాట్లాడతారని, అనేక పరిష్కారాలు సూత్రప్రాయంగా అంగీకరించి ఉంటారని, మిగతా సమస్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేసుకుని ఉంటారనుకుంటే ఏమీ లేకుండా మొక్కుబడిగా ఇద్దరూ కలిసి కూర్చొని టీ, బిస్కెట్లు తిన్నట్లు ఉంది తప్ప ఇది ఏ మాత్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఉపయోగపడేటట్లు లేదన్నారు.
చంద్రబాబు వెళ్లి నేరుగా డ్రగ్స్ గురించి మాట్లాడాడన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన ఘటనలు హైదరాబాద్ లో ఉన్నాయా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినట్లుగా విద్యార్థులంతా స్కూలు బ్యాగులోనే గంజాయి తీసుకెళ్తున్నట్టుగా మన పరువు మనం తీసుకునేటట్టు చంద్రబాబు వ్యవహరించారన్నారు. 2014-19 మధ్య నీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గంజాయి రాజధానిగా ఏపీ మారిందని మాట్లాడారన్నారు.
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా తెలంగాణలోని హైదరాబాద్ లో ఉండి సామరస్యంగా సంపూర్ణంగా చేసుకోవాల్సిన మనం.. చంద్రబాబు నిర్వాకంతో, ఎమ్మెల్సీని కొనడానికి కక్కుర్తి పడి ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని కేసీఆర్ కు దండం పెట్టి వచ్చేయాల్సి వచ్చిందన్నారు.
9, 10 షెడ్యూళ్ల కింద ఆరోజు మనకు రావాల్సినవి రాబట్టుకోకుండా చంద్రబాబు అర్ధాంతరంగా పారిపోయి వచ్చారన్నారు. ఈరోజు అయినా 9, 10 షెడ్యూల్ లో ఉన్న ఆస్తుల వివరాల గురించి మాట్లాడుకుని కొలిక్కి తీసుకొద్దాం అనే ఆలోచన చేయాలన్నారు. షెడ్యూల్ 9కి సంబంధించి 89 సంస్థల విభజనకు సంబంధించి రూ.1,06,199 కోట్లు మన రాష్ట్రానికి రావాల్సిన వాటా ఉందన్నారు. షెడ్యూల్ 10కి సంబంధించి మన రాష్ట్రానికి 142 రకాల ఆస్తులున్నాయన్నారు. వాటి విలువ దాదాపు రూ.39,191 కోట్లు అన్నారు.
ఇవి కాకుండా విభజన చట్టంలో లేనివి మరో 12 ఉంటే వాటి విలువ దాదాపు రూ.1,759 కోట్లు అన్నారు. ఇలా దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ఆస్తుల విషయంలో ఆరోజు వదిలిపెట్టి వచ్చేసిన చంద్రబాబు.. నిన్న ఏమి మాట్లాడారు? ఆ దిశగా ఏ ప్రయత్నం జరిగింది? మనకు జరిగిన నష్టానికి పూడ్చే విధంగా ఎటువంటి చర్యలు జరిగాయనే దానిపై ఎక్కడా సమాధానం లేదన్నారు.
కొన్ని వివాదాలు, అపరిష్కృత అంశాలు, కోర్టు కేసులు ఉన్నాయని, వీటన్నింటినీ ఒక్కొక్కటిగా విభజించి ఏ అంశాల మీద మాట్లాడారో, వేటిపై స్పష్టత వచ్చిందో, ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పకుండా మొక్కుబడిగా అధికారులతో ఓ కమిటీ, మంత్రులతో ఓ కమిటీ, ఆ తర్వాత మళ్లీ అవసరం అయితే మేం కలుస్తాం అంటున్నారని, ఇది కాలయాపన తప్ప ఎక్కడా దీనికి సంబంధించిన పరిష్కార దిశగా ప్రయత్నం చేసినట్లు కనిపించలేదన్నారు.
బీహార్ రాష్ట్రం ప్రత్యేక హోదా అడుగుతోందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. మీరు దాని మీద దృష్టి పెట్టకుండా అది ముగిసిన అధ్యాయంలాగానే మరుగున పడేసినట్టుగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినవి కొన్ని ఉన్నాయని… అవి కూడా ఈరోజు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. అంగీకరించనవి కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీనియర్ అధికారి షీలా బేడీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. అనేక రకాల చర్చలు జరిగాయన్నారు.
మళ్లీ ఈరోజు మీరు రెండు కమిటీలు వేశారన్నారు. ఓ కమిటీ అధికారులు, మరో కమిటీ మంత్రులు, వీళ్లిద్దరి వల్ల కాకపోతే మూడోది ముఖ్యమంత్రుల కమిటీ.. ఇలా ఒక కమిటీ చేయలేని పనికి 3 కమిటీలు వేసి కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. మీరు వేసే ఏ కమిటీలకూ చట్టబద్ధత ఉండదన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేదని, వాళ్ల ప్రమేయంతో ఏర్పాటు చేయాల్సిన అంశమన్నారు. విభజన చట్టాన్ని పార్లమెంటు చేసిందని, అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు.
నీటి ప్రాజెక్టుల నిర్వహణ గురించి ఎక్కడా మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల నిర్వహణలో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. విద్యుత్ రూపంలో తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమ కాలువ నుంచి మన రైతాంగానికి రావాల్సిన సాగునీటిని వాళ్లు విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకుంటుంటే ఆ అంశంపై మీరు మాట్లాడలేదన్నారు.