ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా?

  • ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణం
  • టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు
  • హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు
  • ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా
  • ఎల్బీ స్టేడియంలో పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే…వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా.30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్ ను మీ చేతుల్లో పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిది.

రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం.కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం.

గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం. ఈ బడ్జెట్ లో విద్యకు 10శాతం కేటాయించాలని భావించాం. కానీ హామీల అమలు దృష్ట్యా 7.3శాతం అంటే రూ.21వేల కోట్లకు పైగా కేటాయించాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30వేల పాఠశాలల్లో.. 26 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు. 10వేల ప్రయివేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ప్రైవేటు పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా? మౌళిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది. ఇది కఠోర నిజం. టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు.

ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తారీఖునే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. పదిహేనేళ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా.అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం.

టీచర్లంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచేయాలి. విద్యార్థులకు విద్యనందించాలి. గత ఏడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం.

అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం.ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించాం.తెలంగాణ బలపడాలి అంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలి. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది.గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది.అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం.స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు సుకుంటున్నాం.క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం. మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్ కు బాటలు వేస్తుంది.పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలి.