మోసగించినందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలా?

-మూడు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే
-17 ఎంపీ స్థానాలను గెలుస్తాం
-బండి సంజయ్‌ నామినేషన్‌లో కిషన్‌రెడ్డి
-గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా?: బండి
-ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌

కరీంనగర్‌, మహానాడు: కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్‌ రజనీకాంత్‌ పటేల్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలుత సీఎం భూపేంద్ర, కిషన్‌ రెడ్డి కరీంనగర్‌ హెలిప్యాడ్‌ వద్దకు రాగానే బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, పార్టీ కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాపరామకృష్ణలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం నేరుగా జిల్లా కలెక్టరేట్‌ వద్దకు వచ్చిన గుజరాత్‌ సీఎం, కిషన్‌రెడ్డిలతో కలిసి బండి సంజయ్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ దాఖలు చేశారు. ముగ్గురూ ఒకే కాన్వాయ్‌లో ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ ఓపెన్‌ టాప్‌ వాహనం ఎక్కి మాట్లాడారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు ఓటేయాలో రేవంత్‌ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో 100 రోజుల్లో అమలు చేస్తామని చేయలేదు. రైతులను మోసగించారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్‌కు ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకే తానుముక్కలేనని విమర్శించారు. మూడు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే అని విమర్శించారు. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలవబో తోందని తెలిపారు. కరీంనగర్‌లో ప్రజల కోసం పోరాటం చేసిన అభ్యర్థి ఎవరో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.

గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా?
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు వందల కోట్ల రూపాయలు ఉన్నోళ్లు… వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకుంటారు.. నాకు వారిలా కోట్ల ఆస్తుల్లేవు.. కానీ మీ కోసం కొట్లాడి వందల కేసులున్నోడిని. గడీల వారసులు కావాల్నా? గరీబోళ్ల బిడ్డ బండి సంజయ్‌ కావాల్నా గుండెమీద చేయి వేసుకుని ఓటేయండి అంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులిద్దరూ కేసీఆర్‌ అనే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి వారని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఏనాడైనా రైతులను ఆదుకున్నాడా? పంట నష్టపోతే సాయం చేయించారా? అని ప్రశ్నించారు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ నిధులు దారి మళ్లిస్తే, ఆర్వోబీ నిధులు ఇవ్వకపోతే ఏనాడైనా లేఖ రాశారా? అని అడిగారు. వినోద్‌ కుమార్‌ నాన్‌ లోకల్‌… మరి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎవరు? లోకలా? నాన్‌ లోకలా? చివరకు కాంగ్రెస్‌ క్యాడరే ఏం చెప్పాలో అర్ధం కాక అయోమయంలో ఉన్నారన్నారు. బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు.