ప్రభుత్వ చట్టాల పటిష్ఠంతోనే వైద్యులకు రక్షణ

– సీఐటీయూ డిమాండ్

మచిలీపట్నం, మహానాడు: ప్రభుత్వ చట్టాలు పటిష్ఠంగా అమలు చేస్తేనే వైద్యులకు రక్షణగా ఉంటుందని సీఐటీయూ కృష్ణా జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వైద్య ఉద్యోగులు స్థానిక సర్వజన ఆస్పత్రి వద్ద చేస్తున్న ఆందోళనకు సీఐటీయూ కృష్ణా జిల్లా కమిటీ తరఫున ఆయన పాల్గొని, సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. వైద్యులపై దాడి చేసిన వారిని ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.పోలినాయుడు మాట్లాడుతూ ఇటువంటి దాడుల నివారణకు కేంద్ర స్థాయిలో చట్టం వస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు బెల్లంకొండ కోటేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకుడు ఓఎల్ రావు, సీఐటీయూ నేత సిహెచ్ జై రావు, తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రి నుండి రామానాయుడు పేట కూడలి వరకు ర్యాలీగా వెళ్ళి మానవహారంగా ఏర్పడ్డారు.