Mahanaadu-Logo-PNG-Large

జగన్‌కు మెదడుందా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఈ మాట రఘురామకృష్ణంరాజో.. ఏ లోకేషో.. ఏ పవన్ కల్యాణో.. జగనంటే గిట్టని మీడియానో చెప్పింది కాదు. స్వయంగా జగన్ షెల్మెమ్మ షర్మిల.. షిక్కటి షిరునవ్వుతో ఇచ్చిన సర్టిఫికెట్. తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్ కోర్టుకు వెళ్లిన తర్వాత, షెల్లెమ్మ ఇచ్చిన సర్టిఫికెటు నిజమేకామోసనిపించకమానదు.

లేకపోతే బుద్ధి-బుర్ర ఉన్న ఎవరైనా.. కోర్టుకు సంబంధం లే ని అసెంబ్లీ వ్యవహారాన్ని, తీసుకువెళ్లి కోర్టును న్యాయం అడుగుతారా? ఒక్క ‘లెవన్’రెడ్డి తప్ప! అసలాయనకు అలాంటి దివ్యమైన సలహా ఇచ్చిన న్యాయవాదికి, దండేసి దండం పెట్టాలన్నది వైకాపేయుల మనోభావన.

ఎందుకంటే జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైకాపాకు, అసెంబ్లీలో ఉన్న సీటు కేవలం పదకొండు. అసెంబ్లీలో 10 శాతం సభ్యులున్న పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంటే ఆ హోదా దక్కాలంటే అన్నియ్య పార్టీకి 18 సీట్లు రావాలన్నమాట. కానీ ఏపీలో అన్నాచెల్లెమ్మలు, అవ్వాతాతలు ఆయన పార్టీకి ఇచ్చింది 11 సీట్లే. మరి ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఎట్లిస్తరప్పా?

ఇప్పుడు అన్యియ్య కేవలం వైకాపా ఫ్లోర్ లీడర్ మాత్రమే. కానీ మెయిన్ అప్మోజిషన్ లీడరంత బిల్డప్పులిస్తే ఆయన సొంత మీడియా-మిత్రమీడియా గంటల పాటు లైవ్ ఇచ్చి శునకానందం పొందవచ్చేమో గానీ, శాసనసభకు మాత్రం అన్నియ్య అందరిలా ఎలాంటి ప్రత్యేకతలూ లేని ఎమ్మెల్యే మాత్రమే. దట్సాల్!

అసలు ఈ అంశంపై కోర్టుకు వెళ్లవచ్చా? లేదా? అని ఎవరైనా ‘విషయజ్ఞానం’ ఉన్న వారితో మాట్లాడినట్లు లేదు. తన పార్టీలో ఉన్న ఉమ్మారెడ్డినో, సత్తిబాబునో అడిగినా.. వారు ఇదంతా పనికిమాలిన బుర్రతక్కువ ఆలోచన. అని అప్పుడే తేల్చేవారు. బహుశా వారు అలా అంటారనే అన్నియ్య.. నెల్లూరు న్యాయకోవిదుడైన సుధాకర్‌రెడ్డిగారితో కేసువేయించి ఉంటారన్నది వైకాపేయుల ఉవాచ.

ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రంలో పిజెఆర్ సీఎల్పీనేతగా ఉన్నప్పుడు సభలో కాంగ్రెస్ బలం 26. కాబట్టి కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షహోదా దక్కలేదు. దానితో పిజెఆర్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్‌కే పరిమితమయ్యారు. అందాకా ఎందుకు? కేసీఆర్ జమానాలో భట్టికి కూడా ప్రధాన ప్రతిపక్షహోదా దక్కలేదు. నిరుడు లోక్‌సభలో కాంగ్రెస్‌కూ ప్రధాన ప్రతిపక్షనేత హోదా దక్కకపోయినా.. రాహుల్‌గాంధీ రాముడుమంచిబాలుడిగా, సభలో తన ప్రావీణ్యం ప్రదర్శించి, సమావేశాల మధ్యలో పాదయాత్ర చేసి ఇప్పుడు తాను అనుకున్నది సాధించారు. అంతే తప్ప.. జగనన్నియ్య లెక్క ..నాకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే సభకు వస్తా. లేకపోతే వచ్చేదిలేదని స్కూలుపిల్లకాయలా మారాం చేయలేదు.

నిజంగా జగనన్నియ్య పార్టీకి 18 సీట్లు వచ్చి ఉంటే దానికి హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లనవసరం లేకుండానే స్పీకర్‌గారు.. అన్నియ్యకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇచ్చేవారు. గత సభలో చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా దక్కిందంటే, దానికి కారణం ఆయన పార్టీకి 23 సీట్లు రావడమే. అన్నియ్య సభలో సీఎంగా అటు పక్క కూర్చుని.. ‘మేము కూడా కొంతమంది టీడీటీ ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా దక్కదు’ అని ప్రవచించారు. అంటే.. ఆ నెంబరు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షనేత హోదా వస్తుందని అన్నియ్య గుర్తించబట్టే కదా?!

ఇప్పుడు హైకోర్టు ఏమని తీర్పు ఇస్తుంది? సభలో 10 శాతం మంది సభ్యులు లేకపోయినా 11 సీట్లున్న జగన్‌కు, ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వమని తీర్పు ఇస్తుందా? నిజంగా అలాగే ఇస్తే.. ఇదే తీర్పును పట్టుకుని దేశంలోని చిన్నా చితకా పార్టీలు కూడా తమకూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కావాలని కోరవా? అయినా చట్టసభల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకునేంత సాహసం చేస్తుందా?

కనీస బలం లేని ఒక పార్టీ నేతకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని, స్పీకర్‌ను ఆదేశించే హక్కు హైకోర్టుకు ఉంటుందా? ఒకవేళ అదే జరిగితే.. అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా తమకే దక్కాలని, ప్రభుత్వంలో భాగస్వామ్యం వేరు-సభలో బలం వేరు అని వాదించి జనసేన దళపతి కోర్టుకెక్కితే అప్పుడు హైకోర్టు.. ప్రధాన ప్రతిపక్షనేత హోదాను.. 11 సీట్లున్న జగన్‌కు ఇస్తుందా? 20 సీట్లున్న పవన్‌కు ఇస్తుందా?

ముందు శాసనవ్యవస్థలో హైకోర్టు జోక్యం చేసుకుంటుందా? లేదా అన్నది చూడాలి. అసలు ఇదంతా ప్రధాన ప్రతిపక్షనేత హోదా దక్కితే.. దక్కించుకునే అదనపు సెక్యూరిటీ, ప్రొటోకాల్ కోసమేనన్న విషయం చిన్నపిల్లకాయలకే తెలిసినప్పుడు.. అంతలావు లా పుస్తకాలు చదివిన జడ్జిలకు తెలీదా? మన అమాయకత్వం కాకపోతే?!

ఇక జగనన్నియ్య మొన్న ఢిల్లీకి వెళ్లిన ధర్నా వ్రతం చెడ్డా ఫలితం దక్కింది. కాంగ్రెస్ రాకపోయినా ఇండి కూటమి పార్టీలొచ్చి, జగనన్న భుజం తట్టాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ అసలు ఐదేళ్ల పాలనలో మీడియా ముఖమే చూడని అన్నియ్యకు, గమ్మతుగా ఢిల్లీలో మీడియానే దిక్కయింది. 36 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారయ్యారని జగన్ రోదిస్తే, వాళ్ల పేర్లు చెప్పమన్న మీడియా ప్రశ్నకు అన్నియ్య దగ్గర తెల్లముఖమే తప్ప జవాబు లేదు.

తన ఐదేళ్ల జమానాలో జరిగిన ఆర్ధిక లూటీపై చంద్రబాబు సభలో శ్వేతపత్రం విడుదల చేస్తే.. పులివెందుకు పులి, తాడేపల్లి సింహం, ఎలహంక ఏనుగు, లోటస్‌పాంట్ చిరుత సభకు హాజరుకాకపోవడమే వింత. బాబు ఆరోపణలను ఖండించి, తన వద్ద ఉన్న నిజాలు బయటపెట్టాల్సిన పులివెందుల పులి.. సభను చూసి తాడేపల్లికి పారిపోవడమే విషాదం.

దానికి బదులు తాడేపల్లి ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని, ఎంపిక చేసుకున్న మీడియాను పిలిచి, వారితో చంద్రబాబు స్పీచ్ లైవ్ అయ్యేంతవరకూ తాను కూడా మీడియాముందు ‘ప్రసవించడం’ మరో రోత. అది కూడా ఏ మీడియాను పిలవాలో సెక్యూరిటీకి ఓ లిస్టు ఇచ్చి, వారినే పంపించమన్నారట.

ఎక్కడైనా సీఎం ఒక అంశంపై ప్రసంగించిన తర్వాత.. దానిపై విపక్షనేత స్పందించి, ప్రసంగంలోని లోపాలను ఎత్తిచూపుతారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పాటించిన సంప్రదాయమది. అప్పటి విపక్షనేతలు అసెంబ్లీలోని తమ చాంబరులోనో, పార్టీ ఆఫీసుల్లోనే ప్రెస్‌మీట్ పెట్టి, సీఎం ప్రసంగాన్ని తూర్పరపట్టేవారు.

కానీ జగనన్నియ్య అందుకు భిన్నం. అసలు సభలో సీఎం ప్రసంగం కొనసాగుతుండగానే.. తానూ పోటీ ప్రత్యక్షప్రసారం చేయించుకుని ‘ప్రసవించడం’ ద్వారా, లైవ్ టెలికాస్టును షేర్ చేసుకోవాలన్న మానసిక ఆనందం తప్ప, దానివల్ల ఒరిగే దేమీలేదు. అన్నియ్య ప్రసంగాన్ని ఆయన సొంత మీడియాతోపాటు, మిత్రమీడియా కూడా ఎక్కువ సేపు తాదాత్మ్యంతో తిలగించి, జనంలోకి వదిలింది. పోనీ అందులోనయినా అన్నియ్య అన్నీ నిజాలే చెప్పారా అంటే అదీ లేదు.

తన జమానాలో మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లు జరిగాయని, అసలు డిజిటల్ పేమెంట్లు తీసుకువచ్చిందే తానంటూ.. ఒక నిజమైన అబద్ధాన్ని చాలా బలంగా నిజమనిపించేలా మాట్లాడారు. పిన్నెల్లి మంచి నాయకుడు అంటూ ఇచ్చిన కితాబుకు అక్కడున్న మీడియా ప్రతినిధులే కిసుక్కున నవ్వారట. అది వేరే ముచ్చట.

ఇక ఆర్ధిక అంశాలపై మాట్లాడిన అన్నియ్య.. తాను ఎన్ని భూములు, ఎన్ని సంస్థలను తాకట్టుపెట్టి అప్పులు తీసుకువచ్చారన్న విషయాన్ని దాటేశారు. ఉద్యోగులు దాచిపెట్టిన డబ్బును కూడా కొల్లగొట్టి, ఎందుకు తనఖా పెట్టాల్సివచ్చిందో చెబితే బాగుండేది. సభలో చంద్రబాబు విప్పిన జగనన్న అప్పుల గుట్టు చూస్తే.. పోలీసు కమిషనరేట్లను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన అన్నియ్య తెలివిని చూసి, అప్పుల అప్పారావులు కూడా కుళ్లుకోవలసిందే.

అధికారంలో ఉండగా మీడియాను కేవలం రెండుసార్లే దయతలిచిన అన్నియ్య.. ఈ నెలరోజుల్లో 5 సార్లు మీడియా ముందు ‘ప్రసవించి’ వారి జన్మలను ధన్యం చేశారు. గతంలో ఢిల్లీలో హోంమంత్రిని కలిసి బయటకు వచ్చినప్పుడు, పీవీకి భారతరత్నపై స్పందించాలని మీడియా ప్రశిస్తే.. విజయసాయిరెడ్డి చెబుతాడని వెళ్లిన జగనన్న.. ఇప్పుడు ఢిల్లీ ధర్నాలో మీడియాను పిలిచిమరీ, లోకేష్ రెడ్‌బుక్ గురించి రాయమని బతిమిలాడం హేమిటో?

పులి, సింహం, ఏనుగు, చిరుత అని చెప్పుకునే జగనన్నియ్య మీడియా ముందుకొచ్చి, జర్నలిస్టులడిగే ప్రశ్నలకు ఎందుకు జవాబివ్వరో అర్ధం కాదు. తాను చెప్పదలుకున్నది చెప్పేసి, షిక్కటి షిరునవ్వులు షిందిస్తూ వెళ్లిపోవడమో.. లేదా తాజాగా తాడేపల్లి ఇంటికి ఎంపిక చేసుకున్న మీడియాను మాత్రమే అనుమతించాలని చెప్పి, తాను చెప్పదలచుకున్నది చెప్పేసి, తుర్రుమని వెళ్లడమో అన్నియ్యకు ఒక అలవాటుగా మారింది.

తామే పప్పుగా ఒకప్పుడు ట్రోల్‌చేసిన లోకేష్.. ఇప్పుడు మీడియాను ధైర్యంగా ఎదుర్కొవడమే కాదు. పిలిచిమరీ ప్రశ్నలు అడిగించుకుంటుంటే.. పులివెందుల పులి మాత్రం స్క్రిప్టు లేకుండా, ఐప్యాక్ -మీడియా మ్యాచ్‌ఫిక్సింగ్ ప్రశ్నలు లేకుండా..తనంతటతానుగా నోరుతెరవకపోవడమే వింత. ఈ పరిస్థితిలో తమను ఒక గుమాస్తా, స్టెనో, టైపిస్టుగా చూస్తున్న జగన్ పిలిచే మీడియా పేరంటానికి వెళ్లాలో వద్దో.. వెళ్లి పరువుపోగొట్టుకోవాలో, వెళ్లకుండా నిలబెట్టుకోవాలో మీడియా ఆలోచించుకుంటే వారి ఆరోగ్యానికే మంచిది.