– కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు ప్రచారమా?
– తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపాటు
మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని.. కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాల్సింది పోయి వారిని భయపెడుతున్నారని.. తోకపత్రిక సాక్షి, బ్లూమీడియాలలో విషప్రచారం చేయిస్తూ.. తప్పుడు రాతలు రాయిస్తున్నారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఆకాశంకు చిల్లుపడిందన్నట్లుగా క్లౌడ్ బరెస్ట్ అయ్యి కుంభవృష్టితో వరద పోటెత్తి ఓ వైపు జనం ఇబ్బంది పడుతుంటే.. ఉల్లిగడ్డకు ఉర్లగడ్డకు తేడా తెలియని జగన్ రెడ్డి.. కనీసం ఇటువైపు కన్నెత్తి చూడకపోగా.. అమరావతి మునిపోయిందంటూ అబద్దాలకు తెరలేపారని దుమ్మెత్తిపోశారు.
ఈ మేరకు శ్రీనివాస రెడ్డి మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఏమన్నారంటే..
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఉమ్మడి కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షం కుమ్మరించింది. వందల సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 28 సెంటీమీటర్ల వర్షం పడింది. దాంతోనే మున్నేరు బుడమేరులకు వరద పోటెత్తింది. కాని ప్రతిపక్ష పార్టీ ఇలాంటి విపత్కర సమయంలో కూడా అబద్దాలకు తెరలేపింది. సాక్షి పేపర్ అంటే సీఎంఓ ఆఫీసులా… చంద్రబాబు ఎక్కడ పడుకోవాలి ఎక్కడ ఉండాలో ముందే ఫేక్ ప్రచారం చేశారు. బ్లూ మీడియాను, సాక్షి ఛానల్ ను అడ్డం పెట్టుకును అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం లేకుండా కనీస పరిజ్ఞానం లేకుండా విష ప్రచారం చేస్తున్నారు. వరదతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు. గతంలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లకు వరదలు వస్తే అతలాకుతలం అయ్యాయి. కాని నేడు ఇంత వరద వచ్చినా అమరావతి మునగలేదు.
రాష్ట్రభవిష్యత్ పై దుష్ప్రచారం చేయడం మానుకోవాలి.. కష్టం వస్తే ఆదుకోవడానికి ముందుకు రావాలి కాని విష ప్రచారం చేస్తారా? జగన్ రెడ్డికి అసలు సిగ్గు ఉందా? జగన్ రెడ్డి ధనదాహానికి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షంలో ఉన్నా కాని ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి నారా భువనేశ్వరి బాధితులను ఆదుకున్నారే కాని.. వైసీపీ నేతల్లా ఎన్నడూ ఫేక్ ప్రచారం చేయలేదు. లేనిదాన్ని ఉన్నట్లు అభూత కల్పన కల్పించేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారు. 74 సంవత్సరాల వయసులో కళ్ళలో వత్తులు పెట్టుకుని ప్రజలకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పార్టీ నేతలను చైతన్య పరుస్తూ చంద్రబాబు వరద నీటిలో ప్రజల ప్రాణాలను రక్షిస్తుంటే.. సిగ్గులేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
అంత చీకట్లో కూడా బుడమేరు వలన ముంపునకు గురైన డివిజన్ లలో ప్రతివ్యక్తికి మంచినీరు ఆహారం అందేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ప్రజల పట్ల బాధ్యతతో కరెంట్ లేకపోయినా.. అధికారులు వద్దని వారించినా.. చీకటిని లెక్కచేయకుండా.. సెల్ ఫోన్ లైట్లలోనే ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చంద్రబాబు చేశారు.. ప్రజలకు భరోసా కల్పించారు. గతంలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు…. సాయం పేరుతో ఒక ఉల్లిగడ్డ రెండు ఉర్లగడ్డలు, నాలుగు టమాటాలు, ఎనిమిది పచ్చిమిరప కాయలు, ఒక కొవ్వొత్తిని వరద బాధితుల చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు జగన్. అదికూడా బాధితులందరికీ ఇవ్వలేదు. ఉల్లిగడ్డకు ఉర్లగడ్డకు తేడా తెలియని జగన్ రెడ్డి నేడు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ముంపు ప్రాంతాల బాధితులకు ఆహార పదార్థాలు సేకరించి ఆదుకున్న నాయకత్వం టీడీపీది. పునరావాస కార్యక్రమాల్లో అండగా ఉండాల్సిన జగన్ రెడ్డి.. ఎక్కడా కూడా కించిత్తు సాయం చేయకుండా ప్రజలను ఇంకా భయపెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. క్లౌడ్ బరస్ట్ అయినట్టు.. కుంభవృష్టితో 11 లక్షల 37 వేల క్యూసెక్ ల నీటితో వందేళ్ల తరువాత వరద పోటెత్తింది. నిద్రపోతున్న అధికారులను మేల్కొలిపి తానే ముందుండి ప్రజలను సహాయ చర్యలు చేపట్టిన గొప్ప నాయకుడు చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు వరదలో కట్టగట్టుకు కొట్టుకు వచ్చిన బోట్లపై అనుమానం ఉంది. దీనిపై కూడా లోతైన విచారణ జరగాలి. ఎలాంటి కుట్ర కోణం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలి.