కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేసి మోసపోవద్దు

కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా చేసింది శూన్యం
సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌తో ప్రచారం

సనత్‌నగర్‌: కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలను కోరారు. గురువారం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌తో కలిసి సనత్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని పాటిగడ్డ, ఎన్‌బీటీ నగర్‌, వికార్‌ నగర్‌, వడ్డెర బస్తీ, తబేలా తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగునా మంగళహారతులు, పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్పొరేటర్‌ టి.మహేశ్వరి ఆధ్వర్యంలో వారికి క్రేన్‌ సాయంతో భారీ మాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందో ఆలోచించి ఓటువేయాలని పిలుపునిచ్చారు. ఒకసారి గెలిపించిన కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి కూడా నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించా రు. కనీసం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో కూడా లేరనే విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హామీలను అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావుగౌడ్‌కు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ టి.మహేశ్వరి, సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌ మేడే రాజీవ్‌ సాగర్‌, డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, జనరల్‌ సెక్రటరీ ఆరీఫ్‌, నాయకులు శ్రీహరి, శేఖర్‌, అఖిల్‌, అక్బర్‌, అజ్మత్‌, శ్యాంసుందర్‌, నథీమ్‌, నాగరాజు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.