నాణ్యత లేని ఉత్పత్తులు, అధిక ధరలు ఉంటే ఉపేక్షించం

– మంత్రి మనోహర్‌ రైతు బజార్ల తనిఖీ

విజయవాడ, మహానాడు: నాణ్యత లేని ఉత్పత్తులు, అధిక ధరలు ఉంటే ఉపేక్షించబోమని పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడి రైతు బజార్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. పామాయిల్ లీటరు రూ.110కి, సన్ ఫ్లవర్ ఆయిల్ ను రూ.124కు విక్రయించాలని, అదేవిధంగా అందరికీ కనబడేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు విక్రయించే సరకుల నాణ్యత, ధరలపై మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురునానక్ కాలనీ సహా, పంటకాలువ రోడ్డులో ఉన్న రైతు బజార్లను తనిఖీ చేశారు.

వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారుల అడిగి సమాచారం తెలుసుకున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకమైన ధరల్ని అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయించిందని తెలిపారు. ప్రతి రేషన్‌ కార్డుపై రిఫైండ్‌ ఆయిల్‌ను గరిష్ఠంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలన్నారు. రాష్ట్రంలోని కోటి 49 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డు సదుపాయం ఉండటంతో వారికి సబ్సిడీ ధరలపై వంట నూనె అందనుంది. రైతు బజార్ ల్లోని దుకాణాల వద్ద ధరలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయించారు. ప్రజలకు విక్రయించే ఉల్లి, టామాటా నాణ్యతనూ పరిశీలించారు.