– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట, మహానాడు: పట్టణంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక మల్లమ్మ సెంటర్, స్టేషన్ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, రావిపాడు నుండి ప్రధాన రహదారులు వెంబడి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. మురికి నీరు చెత్తాచెదార్థం పేరుకుపోవడాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. కాలినడకన పలు సచివాలయాలకి చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. వారి విధుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ రాజకీయాలను పక్కనపెట్టి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పట్టణ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
నరసరావుపేట పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వివరించారు. అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టే వ్యవహరిస్తున్నారని ఇకపైన మాటలు ఉండవని చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల అవసరాలు తీర్చేందుకే ఉద్యోగాలు చేస్తున్నట్టు ఉద్యోగస్తులు గుర్తించుకోవాలని తెలిపారు. మరోసారి పరిశీలనకు వస్తానని పారిశుద్ధ్యం ఇలాగే ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.