మాదకద్రవ్యాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు 

ఆంటీ నార్కోటిక్స్ స్పింగ్ డీఎస్పీ సుబ్బరామిరెడ్డి   

అల్వాల్, మహానాడు: యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ స్పింగ్ డీఎస్పీ సుబ్బరామిరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఉత్తర్వుల మేరకు అవగాహన సదస్సు అల్వాల్ లోని పల్లవి మోడల్ స్కూల్లో శనివారం జరిగింది. యాంటీ డ్రగ్స్ వారియర్స్ “యువత మేలుకో” స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ చెడుస్నేహాలు, పరిస్థితుల ప్రభావంతో తాత్కాలిక ఆనందం కోసం గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే అనేక రుగ్మతల బారిన పడతారన్నారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌  చట్టాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు కలిగి ఉండడం, సేవించడం, సరఫరా చేయడం, తయారీ, క్రయవిక్రయాలు అన్నీ క్రిమినల్‌ నేరాలన్నారు. వీటికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అమాయక పిల్లలతో వ్యాపారం చేసి మత్తు పదార్థాలు అమ్మి డబ్బు సంపాదించడం సెక్షన్ 77 కింద నేరం, జె జె యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్లు వాటి నుంచి విముక్తి కోసం స్వయంగా ముందుకు వస్తే వారిపై ఎలాంటి నేర విచారణా ఉండదన్నారు. ఉచితంగా వైద్య సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువత మేలుకో ఎన్జీవో ఫౌండర్ చాట్లపల్లి పురుషోత్తం , కో ఫౌండర్ శ్రీనివాస్, టీమ్ మెంబర్స్ శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, తెలంగాణ ఆంటీ డ్రగ్స్ వింగ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి, మహేష్ ఏఎస్ఐ, స్కూల్ ప్రిన్సిపల్ సునీల్ నాగి, పాల్గొన్నారు.