దొనకొండలో తాగునీటి సమస్య పరిష్కరిస్తా

పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు : దొనకొండ మండలం ఇండ్లచెరువు, భూమనపల్లి, రుద్రసముద్రం, రామాపురం గ్రామాలలో గురువారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు పమిడి రమేష్‌ ఉన్నారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మండలంలో వలసలను నివారించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. దొనకొండ మండలంలో తాగునీటి కష్టాలను నేను అర్థం చేసుకున్నాను. వెలు గొండ ప్రాజెక్టు ద్వారా దొనకొండకు నీటిని తెచ్చి శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషిచేస్తానని తెలిపారు.

ప్రతి ఇంటికి కొళాయి అందించేందుకు కూటమి మేనిఫెస్టోలో టీడీపీ అధినేత మాట ఇచ్చారని పేర్కొన్నారు. దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నానని…దొనకొండ ప్రాంతం నుంచి ఏ ఒక్కరు వలస పోకుండా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గొట్టిపాటి వారసురాలిగా నాలుగో తరం నుంచి దర్శి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను..ఒక డాక్టర్‌గా ప్రజల బాధలు తెలుసు..ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటేసి తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో దొనకొండ మండల పార్టీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.