సీఎం రేవంత్‌కు హరీష్ బహిరంగ లేఖ
హైదరాబాద్, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్ రావు, దేశపతి శ్రీనివాస్ బహిరంగ లేఖ రాశారు. పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో మీరు ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు అభినందనీయం అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తమవి అని చెప్పుకుంటున్న కొన్ని అంశాలు గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కావడం వల్ల నిజాలు తెలియజేయలనే ఉద్దేశ్యం తో ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. లేఖ పూర్తి సారాంశం ఇది..
2017లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచ తెలుగు మహాసభలలో ఇచ్చిన హామీ మేరకే 10.468 పండిత, పి.యిటీ పోస్టుల అప్ గ్రేడేషన్ కు గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. మీరు నిర్వహిస్తున్న సభలో సింహభాగం వారే కావడం గమనించాల్సిందిగా సూచిస్తున్నాం.
గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే, భాషాపండితులకు, పీఈటీలకు అడ్డంకిగా ఉన్న సర్వీసురూల్స్ 11, 12లను మార్చి కొత్తగా 2,3, మరియు 9,10 జి.ఓలను అనుమతించింది. 2023 సెప్టెంబర్ 18 నాడు కాళేశ్వరం జోన్ 1 లో మా ప్రభుత్వమే 1050 గజిటెడ్ ప్రధానోపాధ్యాయ ప్రమోషన్లనూ ఇచ్చింది. ప్రాథమిక పాఠశాలలకు గానూ మా ప్రభుత్వం 10.000 ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తే ఇప్పటివరకూ పాఠశాలలకు కేటాయించలేదు. వెంటనే కేటాయించి ఎస్ జీ టీ లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత ఉపాధ్యాయుల పదోన్నతులకు, బదిలీలకు కూడా గతప్రభుత్వమే సెప్టెంబర్ నెలలో లాంఛనాలు పూర్తిచేసింది.
ఈరోజు వేలాది మంది ఉపాధ్యాయులతో తాము నిర్వహిస్తున్న ముఖాముఖిలో మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఈ కింది హామీలపై స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు వెలువరించి ఆదేశాలు ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బి.ఆర్.ఎస్., పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తోంది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం మొదటి పర్యాయం 43 శాతం, రెండవ పర్యాయం 30 శాతం ఫిట్ మెంట ను కల్పించింది.
కరోనా తో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అతలా కుతలమైనా 30 శాతం పి.ఆర్.సి ప్రకటించి కే సీఆర్ గారు ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మీరు ఎన్నికల సభలలో మాట్లాడుతూ కేసీఆర్ప్రకటించిన దానికన్నా గొప్పగా పీఆర్సీని కల్పిస్తామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మరింత మెరుగైన పీఆర్సీని ఎప్పుడు అమలుచేస్తారో విస్పష్టంగా ప్రకటించాలి, మీరు మీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం పెండిరగ్ లో ఉన్న 4 డి. ఎ. లను ఎప్పుడు అనుమతిస్తారో ఆ సంగతన్నా సభలో ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారు.
న్యూ పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకువస్తామన్నారు. ఎప్పటినుండి అమలుచేస్తారో సభలో ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. పాఠశాలలకు స్కావెంజర్స్ ను అనుమతిస్తామన్నారు. అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. పాఠశాలలకు ఉచిత విద్యుత్ ను అందిస్తామన్నారు. ఇప్పటికీ దానిపై నిర్ణయం ప్రకటించలేదు.
మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి వాటినీ పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. బదిలీ అయినా ఇప్పటివరకూ రాష్ట్రంలో నూతన పాఠశాలలో చేరని ఎస్.జి.టి ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి. బదిలీల వలన ఖాళీలు ఏర్పడిన పాఠశాలలో అవసరమైన మేరకు విద్యావాలంటీర్లను వెనువెంటనే నియమించాలి. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన పెండిరగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే వేతనాలు పెంచాలి. పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట ఉపాహారం అందించే మంచి పథకాన్ని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థుల ప్రయోజనాల రీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం… అని లేఖలో పేర్కొన్నారు.