ముగిసిన ఎన్నికల కోడ్‌

-తక్షణమే ఉత్తర్వుల అమలు
-సీఈవో ముకేష్‌కుమార్‌ మీనా

అమరావతి, జూన్‌ 6: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యం లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉందన్నారు. ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి రాష్ట్రంలో 25 పీసీలకు, 175 ఏసీలకు అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంతో రాష్ట్రం లో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును గురువారం సాయంత్రంతో నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు.