సాగునీటి సంఘాలకు ఎన్నికలు

– త్వరలో షెడ్యూల్ విడుదల
– అధికారుల‌తో సమీక్షలో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

విజ‌య‌వాడ‌, మహానాడు: సాగునీటి సంఘాల ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల, ఎన్నికల నిర్వ‌హణ పై జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు మంగళవారం సమీక్షించారు. విజ‌య‌వాడ జలవనరుల శాఖ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఇరిగేష‌న్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ జి.సాయిప్ర‌సాద్, కాడా కమిష‌న‌ర్ రామ సుంద‌ర రెడ్డి, ఈఎన్సీ ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు లు హాజ‌రయ్యారు. సాగు నీటి సంఘాల ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేయ‌డం, ఎన్నిక‌లు ఏవిధంగా నిర్వ‌హించాలి అనే అంశాల‌పై స‌మ‌గ్రంగా స‌మీక్షించారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన త‌రువాత 40 రోజుల్లోగా, అన‌గా న‌వంబ‌ర్ లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని దీని కోసం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఇరిగేష‌న్ సిఈ, ఎస్ఈల‌తో త్వ‌ర‌లోనే స‌మీక్ష నిర్వ‌హించి, ఎన్నిక‌ల ఏర్పాట్లు చేస్తామ‌ని అన్నారు. అయిదేళ్ళ పాల‌న‌లో కుంటుబ‌డిన సాగు నీటి వ్య‌వ‌స్ద‌ను, సాగు నీటి సంఘాల ద్వారా, రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.