-చెవిరెడ్డి, ఏయూ వైస్ ఛాన్సలర్‌పై చర్యలు తీసుకోండి
-ప్రతినియోజకవర్గంలో ఫెసిలియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి
-ఫారం-12, పోస్టల్ బ్యాలెట్ పత్రాల సమర్పణ తేదీని పొడిగించాలి
-ఈసీకి టీడీపీ నేతలు దేవినేని ఉమ, పరుచూరి అశోక్‌బాబు వినతి
అమరావతి, మహానాడు: ప్రభుత్వ ఉద్యోగుల ఫారం-12 పత్రాల సమర్పణ తేదీని పొడిగించాలని, ప్రతి ఒక్క ఉద్యోగి వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు కోరారు. ఎన్నికల అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్న అధికార వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ వీసీపై చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళా అధికారిణి బెదిరించిన ఒంగోలు పార్లమెంటు వైకాపా అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటికి హద్దుఅదుపు లేకుండా మాట్లాడుతూ ఎన్నికల నియమా వళి ఉల్లంఘించారని, ఆర్వో, మహిళా రిటర్నింగ్ ఆఫీసర్, తహసీల్దారుపై మీకు ఇంకా సర్వీస్ ఉంది.. కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందంటూ బరితెగించి బెదిరించారని పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై ఇప్పటికే ఎన్నో సార్లు ఫిర్యాదులు చేశాం. ఈయ చేసిన ఘనకార్యాలకు మూడోసారి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా నియమించారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన ఆయన విద్యార్థులతో వైసీపీకి అనుకూలంగా రాజకీయాలు చేస్తుంటాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అచీవర్స్ డే సమావేశం నిర్వహించారు. 800 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను సమావేశానికి హాజరుకావాలని నోటీసులు పంపించారు. గతంలో కూడా సర్వేల పేరుతో పిల్లలను గ్రామాల్లోకి పంపినట్లు ఇతనిపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఆయనపైనా చర్యలు తీసుకోవాలని మరో ఫిర్యాదు చేశాం.
ఫారం-12పై అవగాహన కల్పించండి : ఎమ్మెల్సీ అశోక్‌బాబు
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పత్రాల సమర్పణ ప్రక్రియ 26వ తేదీతో ముగియనుంది. అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సమాచారం అంద నందున తేదీ పొడిగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. నోడల్ ఆఫీసర్ల గురించి కూడా అనేక మంది ఉద్యోగులకు వారు ఎవరో కూడా తెలియదు. 25 జిల్లాలకు నియమించిన నోడల్ ఆఫీసర్ల పేర్లు, అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లు వెబ్‌సైట్‌లో పెట్టాలి. నోడల్ ఆఫీసర్ల నియామకం గురించి పత్రికా ప్రకటన కూడా విడుదల చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. పోలీసుశాఖలోని ఉద్యోగులకుి ఫారం-12 ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ సేవలను కల్పించాలి. నాన్ గవర్నమెంట్ సర్వీస్‌లో పనిచేస్తున్న డ్రైవర్లు, ఈవీఎం మెకానిక్‌లు, వీడియో గ్రాఫర్‌లు వంటి వారిని ఇంతవరకు నియమించుకోలేదు. వీరిని నియమించుకున్న రోజు నాటికి ఫారం-12 పత్రాల సమర్పణ ముగిస్తే వారు తమ ఓటును వినియోగించుకోలేరు. దీనిపై కూడా సమీక్షించాలని ఈసీని కోరాం.
పీవోలు, ఏపీవోలకు ట్రైనింగ్ సెంటర్‌లోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకుంటారు. మిగిలిన పోలింగ్ అధికారులకు కూడా జిల్లాకు ఒకటి కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. మొత్తం 6 లక్షల వరకు ఫారం-12 పత్రాలు ఇవ్వాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్‌పై అవగాహన లేక గతంలో వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇప్పుడు ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్‌పై అవగాహన కల్పించి వారి ఓటు చెల్లేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. తప్పకుండా ఈ విషయాలపై కేంద్ర ఎన్నికల సంఘంతో సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటా మని సానుకూలంగా స్పందించారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణ, టీడీఎల్‌పీ నేత కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.