– ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
గురజాల, మహానాడు: వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనితీరుపై గురువారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే మాట్లాడారు. డ్రైనేజ్ వాటర్, మంచినీరు కలిస్తే ప్రజలు అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తక్షణమే పైప్ లైన్లకు లీకేజీలు ఉంటే సరిచేయాలని సూచించారు. భారీ వర్షాలకు, వరదలకు తెగిపోయిన వైర్లు, పడిపోయిన స్తంభాలు ఉంటే వాటిని తక్షణమే సరిచేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసి ప్రజలకు విద్యుత్ అందజేయాలని విద్యుత్ అధికారులకు యరపతినేని ఆదేశించారు. ప్రకృతి నేర్పిన పాఠాలను మనసులో ఉంచుకొని రాబోయే ప్రమాదాలను ప్రజలందరూ కలిసికట్టుగా ఎదుర్కొవాలని కోరారు.