చిరు వ్యాపారులకు లోకేష్ యూరో కార్టులు

– చిరు వ్యాపారులకు ఆశీలు ఫీజు రద్దు చేస్తాం
– నారా లోకేష్ చేతులమీదుగా శ్రీకారం
– మంగళగిరిలో చిరువ్యాపారులకు నారా లోకేష్ మరో వరం

మంగళగిరి: టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరువ్యాపారులకు ఆశీలు ఫీజు రద్దుచేస్తామని యువనేత లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చిరువ్యాపారుల జీవనోపాధికి ఇప్పటికే వివిధ రూపాల్లో చేయూతనిస్తున్న యువనేత నారా లోకేష్ బుధవారం మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

ఎన్ఆర్ఐ టిడిపి సహకారంతో చిరువ్యాపారుల ఆదాయాన్ని కనీసం 50శాతం పెంచే దిశగా అధునాతన యూరోకార్టు సేవలను లోకేష్ ప్రారంభించారు. రోడ్లవెంట టిఫిన్ బండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులకు పాశ్చాత్య దేశాల్లో మాదిరి అధునాతన సదుపాయాలతో కూడిన యూరోకార్టులను యువనేత అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం పేరుతో కుడి చేత్తో రూ.10 ఇచ్చి, ఎడమచేత్తో వందలాగేస్తున్నారని అన్నారు.

వీధి వ్యాపారులకు వడ్డీలేని రుణాల పేరుతో 10వేలు ఇస్తున్నారని, ఇదే సమయంలో ఆశీలు పేరుతో ఏటా రూ.10,800 లాగేస్తున్నారని తెలిపారు. చిరువ్యాపారులు ఎక్కడైతే రోజువారీ బళ్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారో, వారికి అక్కడే లైసెన్సులు ఇచ్చి పోలీసు వేధింపులు లేకుండా చేస్తామని తెలిపారు. చిరువ్యాపారుల బళ్లవద్ద చెత్తను మున్సిపాలిటీల ద్వారా సేకరించే విధంగా ఏర్పాటుచేస్తామన్నారు.

యూరో కార్డులు పొందిన లబ్ధిదారులకు బ్యాంకుద్వారా వర్కింగ్ క్యాపిటల్ సమకూరుస్తున్నందున అడ్డగోలు వడ్డీల బెడద ఉండదని తెలిపారు. శుభ్రత విషయంలో వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ వారిచే 5స్టార్ స్టార్స్ హోటల్స్ కి ధీటుగా వెస్టిన్ హోటల్ మేనేజ్‌మెంట్ స్కూల్ వారిచే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ అధునాతన యూరోకార్టుల వల్ల చిరువ్యాపారుల ఆదాయం 50శాతం వరకు పెరుగుతుందని లోకేష్ అన్నారు.

యూరోకార్టుల ప్రత్యేకతలివే!
అధునాతంగా రూపొందించిన యూరోకార్టులు తేలికగా శుభ్రం చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. శుభ్రత విషయంలో స్టార్స్ హోటల్స్ కి ధీటుగా వెస్టిన్ హోటల్ మేనేజ్‌మెంట్ స్కూల్ వారు ముందుగా చిరువ్యాపారులకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. చిరువ్యాపారులకు అవసరమైన రోజువారీ సరుకులను ఆర్డర్ పై వేర్వేరు బ్రాండెడ్ స్టోర్స్ వారు బండి దగ్గరకే పంపేవిధంగా ఏర్పాట్లుచేశారు. ఈ లావాదేవీలకి అవసరమైన బ్యాంకు సేవలను హెచ్‌డీఎఫ్‌సీ వారు అందిస్తారు.

రోజువారీ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతోపాటు యూరోకార్టు స్క్రీన్ పై ప్రకటనల ద్వారా కూడా మరికొంత ఆదాయం లభించే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐ టిడిపికి చెందిన ప్రవాస భారతీయుడు గుంటుపల్లి జయకుమార్, మురళి రాపర్ల సహకారంతో బుధవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ఇంటివద్ద యువనేత నారా లోకేష్ చేతులమీదుగా ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. చిరువ్యాపారుల ఆదాయంతోపాటు జీవనప్రమాణాలు పెంచడానికి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం.

పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాబోయే ప్రజాప్రభుత్వంలో దీనిని రాష్ట్రస్థాయిలో విస్తరించాలని భావిస్తున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో 50 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి యూరో కార్టులు అందజేసారు. అందులో కొంతమంది లబ్దిదారులకు లోకేష్ నేరుగా యూరో కార్టులు తన నివాసం వద్ద అందజేశారు.

తమ కుటుంబ పోషణ కు యూరో కార్టులు ఎంతగానో ఉపయోగపడతాయి అని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, ఇతర ముఖ్యనేతలు, ఎన్ఆర్ఐ టిడిపి కి చెందిన గుంటుపల్లి జై కుమార్, మురళీ రాపర్ల, యూరో కార్ట్ డిజైనర్ కృష్ణం రాజు, వెస్ట్ ఇన్ ట్రైనర్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.