ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, మహానాడు: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. మండలంలోని చెరువుకొమ్ముపాలెం, కొత్త బెల్లంకొండ వారి పాలెం, పెద్దవరం గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ. 35 లక్షల రూపాయల సీసీ రోడ్లు, డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు.

క్రక్స్ బయోటెక్ కంపెనీ వారి సహకారంతో కొత్త బెల్లంకొండ వారి పాలెం గ్రామంలో మంచినీటి వాటర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ ఏర్పాటు నిర్మాణానికి ముందుకొచ్చిన క్రక్స్ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను అన్నివర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా, ఇచ్చిన ప్రతి హామీని, మాటను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

చెరువుకొమ్ముపాలెం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన గ్రామ ఎంపీటీసీ చిలకమ్మ నాగుల్ నాయక్, కొండా నాయక్, వెంకటరమణ నాయక్, సైదా లను పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.