సాధారణ బదిలీల్లో ఆ ఉద్యోగులకు మినహాయింపు

– ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీజేఏసీ హర్షం

అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్యోగుల సాధారణ బదిలీలు జరుగుతున్నాయని 2025 మార్చి 31 లోపు పదవి విరమణ చేసే ఉద్యోగులందరికీ ఈ బదిలీల నుండి మినహాయింపు ప్రభుత్వం ఇచ్చిందని ఏపీజేఏసీ అమరావతి తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శనివారం ప్రభుత్వం జీవోను విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిసెట్టి దామోదర్ రావు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల ఉత్తర్వుల్లో సంవత్సరం లోపు పదవీ విరామం (రిటైర్) పొందే ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వలేదని, దానివలన 62 సంవత్సరాల వయసులో అనేక శారీరక జబ్బులతో (షుగర్, బీపీ, హార్ట్ పేషంట్స్ ) ఉన్న వారు తీవ్ర ఇబ్బందులకు గురికావడమే కాకుండా, వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాలు ముందుగా తయారు చేసుకునే వెసులుబాటు ఉండదని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం 31.03.2025 లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులందరికీ ప్రస్తుత సాధారణ బదిలీల నుండి మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు.