కొల్లిపర, తెనాలి మండలాల్లో పెమ్మసాని విస్తృత పర్యటన

-నీటి మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇళ్ళ పరిశీలన
– కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితులను ఆదుకుంటామని భరోసా

తెనాలి, మహానాడు: నీట మునిగిన పంటల నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వపరంగా అండగా నిలుస్తాం… బీమా, సబ్సిడీ, ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకుంటాం… అన్నవరం – అన్నవరపు లంక మధ్యన వంతెన నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై మా వంతు ప్రయత్నం చేస్తాం… అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బాధితులకు భరోసా ఇచ్చారు.

పెమ్మసాని.. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి కొల్లిపర మండలంలోని అన్నవరపు లంక, కొత్తూరు లంక, తెనాలి మండలంలోని బుర్రిపాలెం, చక్రాయపాలెం, కొలకలూరు ఖాజీపేట, హాఫ్ పేట గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. అన్నవరపు లంక, కొత్తూరులంక గ్రామాల్లో వరద ప్రభావంతో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అన్నవరపు లంక, అన్నవరం వరకు 2.5 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మిస్తే లంక గ్రామాలు భద్రంగా ఉంటాయని రైతులు పెమ్మసాని దృష్టికి తీసుకొచ్చారు. నీటిలో ఉన్న మొక్కలు దెబ్బతింటాయని, ఇదే వరద కొనసాగితే తమ గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉందని కొత్తూరు లంక వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ళ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ప్రతి ఐదేళ్లకోసారి వరదలు రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వివరించారు.

దెబ్బతిన్న ఇళ్ళ పరిశీలన
బుర్రిపాలెం శివారు ప్రాంతాల్లో వరద కారణంగా ఇళ్ళు నీట మునిగాయని, ఆదుకోవాలని పెమ్మసానిని స్థానిక మహిళలు కోరారు. స్పందించిన పెమ్మసాని ఆ ఇళ్ళను పరిశీలించారు. వాటి నిర్మాణాలకు అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

కౌలు రైతులనూ ఆదుకుంటాం
తెనాలి మండలంలోని ఖాజీపేట, కొలకలూరు, హాంపేట గ్రామాల్లో పెమ్మసాని పర్యటించారు. స్థానిక రైతులు పెమ్మసాని వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎక్కువ మంది రైతులు కౌలుకు భూములు తీసుకుని సాగు చేసుకుంటున్నామని, తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులనూ ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని పెమ్మసాని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందిస్తామన్నారు.

శాశ్వత పరిష్కారానికి చర్యలు
లంక గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఆలపాటి రాజా, కలెక్టర్ నాగలక్ష్మి తో కలిసి పెమ్మసాని విలేకర్లతో మాట్లాడారు. ఈ ప్రాంత సమస్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు. నష్టపోయిన రైతులకు బీమా అందేలా చూస్తామన్నారు. వరద ప్రభావంతో జరిగిన నష్టాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని పెమసాని వివరించారు.