Mahanaadu-Logo-PNG-Large

విద్యుత్‌ శాఖలో రూ.15 వేల కోట్ల దోపిడీ

అస్మదీయ కంపెనీలు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్‌
ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ మీటర్లు, కండక్టర్లలో భారీ అవినీతి
షిరిడిసాయి, రాఘవ, విక్రన్‌ సంస్థలకు అధిక ధరలకు లబ్ధి
ఆర్‌డీఎస్‌ఎస్‌ పనుల్లోనూ రూ.3,500 కోట్ల జే ట్యాక్స్‌
సీబీఐతో దర్యాప్తు చేయించి వాస్తవాలు బయటపెట్టాలి
బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

విజయవాడ: రాష్ట్ర విద్యుత్‌ సంస్థలలో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని జగన్‌ ప్రభుత్వంలో వారి అస్మదీయ కంపెనీలు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం జరిగిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపిం చారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రికల్‌ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్ల సరఫరా కాంట్రాక్టు కు సంబంధించి దాదాపు రూ.15 వేల కోట్ల అవినీతి జరిగిందని వివరించారు. ఆర్డీఎస్‌ఎస్‌ స్కీమ్‌, జగనన్న కాలనీలలో విద్యుత్‌ మౌలిక సదుపాయాల కల్పన పేరిట దోపిడీ జరిగిందని వెల్లడిరచారు. ఇందులో కొంతమంది అధికారుల సహకారంతో అస్మదీయ కంపెనీలకు దోచిపెట్టారని ఆరోపించారు. రాష్ట్ర విద్యు త్‌ శాఖలోని ప్రభుత్వ సంస్థలు అక్రమంగా కాంట్రాక్టుల పేరుతో షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌, రాఘవ కనస్ట్రక్షన్స్‌, విక్రాన్‌ వంటి సంస్థలకు గత ఐదేళ్లు తాబేదా రులాగా వ్యవహరించాయని తెలిపారు. వాస్తవ అగ్రిమెంట్‌ ప్రకారం రాష్ట్ర విద్యు త్‌ సంస్థలు చెల్లించాల్సిన చెల్లింపులను పెంచి అధికంగా ఇచ్చారని వివరిం చారు.

విద్యుత్‌ మీటర్లలో అవినీతి

విద్యుత్‌ మీటర్లకు సంబంధించి మెటీరియల్‌ సరఫరా సమయంలోనే 80 శాతం చెల్లింపులు చేయటం వెనక పెద్ద అవినీతి దాగుంది. సాధారణంగా మెటీరియల్‌ సరఫరా సమయంలో 50 శాతం, ఎరక్షన్‌ సమయంలో 40 శాతం, మొత్తం పని పూర్తయిన తర్వాత 10 శాతం చెల్లించే విధానం ఉండగా, మెటీరియల్‌ సరఫరా సమయంలోనే 80 శాతం చెల్లింపు వెనకాల మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. చెల్లింపులు గత ఏడాదిలోనే చేసినా ఇప్పటికీ ఈ మెటీరియల్‌ మొత్తం ఆయా కాంట్రాక్టులకు సంబంధించిన గోదాములలోనే ఉన్నాయన్నారు. అమరావతి కేబుల్‌ ఏ విధంగా తరలించారో వీటిని కూడా మళ్లించే ప్రమాదం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య విద్యుత్‌ మీటర్లను సరఫరా చేస్తుంటే ఇక్కడ మాత్రం దానికి రెండున్నర నుంచి మూడున్న ర రేట్లు అధిక ధరలను ప్రభుత్వం చెల్లించింది. రూ.1800 కోట్ల నుంచి రూ.2000 కోట్ల అవినీతి ఉందని సమాచారం. సంవత్సరం క్రితమే ఈ చెల్లింపులు చేశారనే సమాచారం ఉంది.

అన్ని మెటీరియల్స్‌లో అధిక ధరలతో దోచుకున్నారు..

ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ తీగలు, కేబుల్స్‌, సిమెంటు పోల్స్‌ తదితర మెటీరియల్‌ ధరలలో కూడా దేశంలోనే అత్యధిక ధరలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ప్రభుత్వ ధనాన్ని అస్మదీయ కంపెనీలకు దోచిపెట్టింది. రాబోయే మూడు సంవత్సరాలకు సరిపడా మెటీరియల్‌కు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి వాటికి చెల్లింపులు చేసిన వైనం విస్మయానికి గురి చేస్తుంది. ఇంత ముందుగా కొన్న ట్రాన్స్‌ఫార్మర్లు నిరుపయోగంగా దీర్ఘకాలం నిల్వ ఉంచినందున తుప్పు పట్టి పోయే ప్రమాదం ఉంది. వాటి గ్యారంటీ సమయం ఐదేళ్లు అయితే దాదాపు రెండేళ్లు వృధా అయి న పరిస్థితి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ల బుషింగ్‌, బుషింగ్‌ రాడ్లు, ఆయిల్‌ కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే దానికి ఆ సంస్థలకు చెల్లించిన ధరలే నిదర్శనం. ఉదాహరణకు 63 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో రూ.2.69 లక్షలు అయితే తెలంగాణలో రూ.1.20 లక్షలు, అదే మహారాష్ట్ర అయితే రూ.1.08 లక్షలు మాత్రమే ఉంది. అల్యూమినియం కండక్టర్లు 100 స్క్వేర్‌ ఎంఎం ఒక కిలోమీటర్‌కు రాష్ట్రంలో రూ.1,46,800 ఉంటే తెలంగాణలో రూ.78 వేలు, మహారాష్ట్రలో రూ.67000 మాత్రమే ఉంది. 11 కేవీ వీసీబీ రాష్ట్రంలో రూ.6,23,000 ఉంటే తెలంగాణలో రూ.345,000, మహారాష్ట్రలో రూ.1,95, 000 మాత్రమే ఉంది. ఇలా పెద్దఎత్తున అస్మదీయ కాంట్రాక్టర్లకు దోచిపెట్టినట్టు లెక్కలతో సహా దొరికిపోయింది.

జే ట్యాక్స్‌తో రూ.3,500 కోట్ల అవినీతి

అలాగే ఆర్‌డీఎస్‌ఎస్‌ ద్వారా సూచించిన రూ.11 వేల కోట్ల పనులలో 29 శాతం అధికంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఆర్‌డీఎస్‌ఎస్‌ సూచించిన కాం ట్రాక్టు ధరలకు సంబంధించి అధిక చెల్లింపులలో జే ట్యాక్స్‌తో దాదాపు రూ.3500 కోట్ల అవినీతి జరిగింది. ఈ మొత్తం విద్యుత్‌ కాంట్రాక్టర్లు అస్మదీయ కంపెనీలైన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌, రాఘవ కనస్ట్రక్షన్స్‌, విక్రన్‌ వంటి సంస్థల కు జగన్మోహన్‌ రెడ్డి ఆయాచిత లబ్ధి చేకూర్చారు. గత రెండు మూడురోజులుగా విద్యుత్‌ కాంట్రాక్టర్లకు సంబంధించి డివియేషన్లు, అధిక ధరలు చెల్లింపులు సం బంధించిన అనేక నిర్ణయాలు జరిగాయనే వార్తలు వస్తున్నాయి. రాబోయే ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవా లను బహిర్గతపరచి ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది.