నల్లపాడు సహకార సొసైటీలో నకిలీ రుణాలు!

– బ్యాంకు నోటీసులతో అన్నదాత ఆందోళన
– గుట్టు రట్టవుడంతో క్షణాల్లో చెల్లింపు
– వ్యవహారం మరుగునపరిచే యత్నాలు

గుంటూరు, మహానాడు: గుంటూరు జిల్లా నల్లపాడు సహకార సొసైటీ లో నకిలీ రుణాల వ్యవహారం వెలుగు చూసింది. మిర్చి రైతులు
కోల్ట్ స్టోరేజ్ లలో నిల్వ చేసిన మిర్చి ను చూపి వ్యాపారులు భారీగా రుణాలు పొందారు. రైతులకు తెలియకుండా వారి పేరుతో నకిలీ రుణాలు పొందారు. వైసీపీ ప్రభుత్వం లో జరిగిన ఈ నకిలీ రుణాలు స్కాం అధికారులు సహకరించారు. సంబంధం లేని రైతు లకు నోటీసులు రావడంతో లబోదిబో అంటున్నారు. జిల్లాల్లోని సహకార సొసైటీ లలో వైసీపీ నేతలు అందినకాడికి దోచుకున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల కోట్లు నకిలీ రుణాలు పొందారు. వాటిలో తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గం లోని నల్లపాడు సహకార సొసైటీ లో నకిలీ రుణాల బాగోతం బయటపడింది. కోల్ట్ స్టోరేజ్ లో రైతులు నిల్వ చేసిన మిర్చి ను చూపించి రైతులకు తెలియకుండా మిర్చి వ్యాపారులు భారీగా రుణాలు పొందారు. వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి పేరుతో బ్యాంకు నుంచి నోటీసులు రావడం తో ఈ రుణాలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుధాకర్ పేరుతో నకిలీ రుణాలు మీడియాలో రావడం హడావుడిగా అతని పేరుతో తీసుకున్న రుణం తక్షణమే చెల్లించినట్టు తెలుస్తోంది. నల్లపాడు బ్రాంచ్ లో రైతుల పేరుతో తీసుకున్న రుణాల సొమ్ము తో తాడికొండ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్ లు వేసినట్టు తెలుస్తోంది. అయితే జీడీసీసీ బ్యాంకు నల్లపాడు బ్రాంచ్లో వెలుగు చూసిన అవినీతి వ్యవహారం మరుగునపరిచే ప్రయత్నాలు పెద్దఎత్తున జరుగుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

ఒక కోల్డెరేజ్ లో నిల్వ చేసిన సరుకుకు రూ.53 కోట్ల రుణం ఎలా ఇచ్చారనేది మిస్టరీగా మారింది. దాదాపుగా 150 మంది రైతుల పేర్లతో ఈ రుణాలు తీసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొందరి ఆధార్లు, పట్టాదారు పాసుపుస్తకాలు నకిలీవి సృష్టించి బ్యాంకు నుంచి రుణం పొందారు. అసలు పొలం లేని వ్యక్తుల పేర్లతో రుణం మంజూరైందంటే నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కూడా సృష్టించి ఉంటారని తెలుస్తోంది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు కూడా రుణాలు పొందినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

దీనిపై ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు, గుంటూరు కలెక్టర్ కు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో రైతులు ఫిర్యాదు చేయగా వారు విచారణకు ఆదేశించారు. కాగా బ్యాంకు నుంచి తీసుకున్న రుణంతో తాడికొండ, అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు భోక్తలపై ఆరోపణలు వస్తున్నాయి. వట్టిచెరుకూరుకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆందోళనతో ఆయన పేరు మీద తీసుకున్న రుణం రూ.10 లక్షలు తిరిగి చెల్లించేశారు. అంతమాత్రాన జరిగిన నేరాన్ని కప్పి పెడతారా అని టీడీపీ శ్రేణలు బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నల్లపాడు సొసైటీ రుణాల కుంభకోణం పై విజిలెన్స్, సహకార శాఖ అధికారులు విచారణలు జరిపితే అసలు సూత్రధారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.