-జగన్‌పై ఎంపీ, ఎమ్మెల్సీల తిరుగుబాటు
– వైసీపీలో రాజీనామాల పర్వం
– ఎమ్మెల్సీ, మహిళా అధ్యక్ష పదవికి పోతుల సునీత రాజీనామా
– మండలి చైర్మన్, జగన్‌కు రాజీనామా లేఖ పంపిన సునీత
– నేడు పార్టీ, ఎంపి పదవికి మోపిదేవి రమణ రాజీనామా
– 9న టీడీపీలో చేరికకు ముహుర్తం?
– టీడీపీ వైపు సునీత చూపు?
– అదే బాటలో బీద మస్తాన్‌రావు, గొల్ల బాబూరావు, రఘునాధరెడ్డి, నిరంజన్‌రెడ్డి, అయోధ్య, నత్వాని, పిల్లి సుభాష్, ఆర్.కృష్ణయ్య?
– వీరిలో కొందరు బీజేపీ, మరికొందరు జనసేన వైపు?
– జనసేన వైపు పిల్లి సుభాష్, బాలినేని చూపు?
– జగన్ అహంకారమే వలసలకు కారణం
– సజ్జల పెత్తనం భరించలేక మరికొందరి నిష్క్రమణం
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ అధినేత జగన్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో పార్టీ దుకాణం బంద్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు పార్టీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 25 రోజుల జగన్ లండన్ పర్యటన ముగించుకుని వచ్చే లోగా ఒక్క ఎంపీ మినహా, మరెవరూ కనిపించకపోవచ్చు. ప్రస్తుత వైసీపీ అంతర్గత రాజకీయ పరిణామాలు దానినే సూచిస్తున్నాయి.
151 స్థానాలతో తిరుగులేని అధికారం సంపాదించి.. ఐదేళ్లు ఏపీని కదలకుండా కంటితో శాసించిన వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై, సొంత పార్టీ ఎంపీ-ఎమ్మెల్సీలు తిరుగుబాటు జెండాకు సిద్ధమవుతుండటం వైసీపీ శిబిరాన్ని కలవరపరుస్తోంది. అందులో తొలి అడుగుగా వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెలీస పోతుల సునీత పార్టీ అధినేత జగన్‌పై రాజీనామా అస్త్రం సంధించారు. ఆమె తన పార్టీ, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో తిరుగుబాటుదారులకు దారి చూపారు.
ఇక గురువారం రాజ్యసభసభ్యుడు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ తన పార్టీ-ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరిలో సునీత రాజకీయ ప్రస్థానం టీడీపీలో ప్రారంభమవగా, మోపిదేవి రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో మొదలయింది. మరికొందరు ఎంపిలు కూడా జగన్‌కు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
వైసీపీ ‘ఫ్యాను’ రెక్కలు ముక్కలవుతోంది. మితిమీరిన అహంకారం-సహచరులు-అనుచరులను లెక్కచేయని నియంతృత్వానికి పార్టీ అధినేత జగన్ మూల్యం చెల్లించుకోనున్నారు. ఆయన నియంతృత్వాన్ని భరించలేని ఎంపీలు-ఎమ్మెల్సీలు తిరుగుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని, సొంత దారి చూసుకుంటున్నారు. అందులో భాగంగా చీరాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన ఎమ్మెల్సీ-పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండలి చైర్మన్, పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపించారు. ఇది జగన్‌కు అసమ్మతివాదులు ఇచ్చిన తొలి ఝలక్.
‘మేం ఎక్కడున్నా మర్యాద, గౌరవం కోరుకుంటాం. అలాగే చిత్తశుద్ధితో పనిచేస్తాం. కానీ జగన్ దగ్గర కనీస మర్యాద-గౌరవం దక్కలేదు. ఆయన మాతో కూడా మాట్లాడకపోతే ఇక ఎవరితో మాట్లాడతారు? రాజకీయాలు తెలియని వారిని మాపై రుద్ది పెత్తనం చేయమంటే ఎంతకాలం భరిస్తాం? రాజకీయాల్లో గౌరవం కోరుకునేవారు జగన్ దగ్గర ఎక్కువకాలం పనిచేయడం కష్టం. అందుకే ఆయన నాకు ఇచ్చిన ఎమ్మెల్సీ-పార్టీ పదవులకు రాజీనామా చేయడం నైతిక బాధ్యతగా భావించా. నాకు పదవి ఇచ్చినందుకు జగన్‌కు కృతజ్ఞతలు. కానీ మనిషిని మనిషిగా చూడలేని వైసీపీ నాయకత్వ విధానాలు నచ్చలేదు. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు. అందరి పరిస్థితి కూడా ఇంతే ఉంది. నా అనుచరులతో సమావేశమయి, ఏ పార్టీలో చేరాలో ప్రకటిస్తా’నని పోతుల సునీత చెప్పారు. కాగా ఆమె కూడా త్వరలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా ఎంపి మోపిదేవి రమణ గురువారం తన ఎంపీ-పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నారు. అంతకుముందు ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. వారిలో ఒక్క నగరం మండల నేత మినహా, మిగిలిన వారంతా మోపిదేవి వెంట నడుస్తామని హామీ ఇచ్చారు. మోపిదేవి వచ్చేనెల 9న టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆయన ఎలాంటి షరతులు లేకుండా టీడీపీలో చేరనున్నారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా, రేపల్లె నుంచి విడిపోయే కొత్త నియోజకవర్గం నుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. మోపిదేవి చేరికకు మంత్రి అనగాని కూడా సుముఖంగానే ఉండటంతో మోపిదేవి చేరికకు మార్గం సుగమమయినట్లే.
నిజానికి మోపిదేవి రాజ్యసభ సీటును అప్పట్లోనే తిరస్కరించారు. తాను జనంలో తిరిగే నాయకుడినని, తనకు ఢిల్లీ వెళ్లడం ఇష్టం లేదని చెప్పినా జగన్ వినిపించుకోలేదు. ఇటీవలి ఎన్నికల్లో రేపల్లె నుంచి తనకు గానీ, తన సోదరుడికి గానీ అవకాశం ఇవ్వాలని కోరినా జగన్ పట్టించుకోకుండా, పెద్దగా గుర్తింపులేని వ్యక్తికి సీటివ్వడంతో అక్కడ పార్టీ ఓడిపోయింది. అప్పటినుంచీ మోపిదేవి పార్టీ అధినేత తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను జగన్ దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో, అవన్నీ నియోజకవర్గ ఇన్చార్జి చూసుకుంటాడన్న జగన్ వ్యాఖ్యలపై మోపిదేవి ఆగ్రహంతో రగలిపోయారు. ఆరకంగా జగన్ తనను పొమ్మనలేక పొగబెడుతున్నారని గ్రహించారు. జగన్ వల్ల జైలు జీవితం అనుభవించిన తనకు సైతం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో, వైసీపీ నుంచి నిష్క్రమించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చారు.
కాగా నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావు కూడా వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈపాటికే జిల్లాలోని తన అనుచరులతో మాట్లాడినట్లు సమాచారం. పాయకరావుపేటకు చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కూడా, టీడీపీ వైపే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఆయన కూడా జగన్ వైఖరిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీరంతా టీడీపీ నాయకత్వంతో ఒక దశ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ బహుశా వచ్చే నెల మొదటి వారంలో వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరవచ్చని సమాచారం.
ఇక గత రెండేళ్ల నుండి జగన్‌తో విబేధిస్తున్న బీసీ నేత, ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం స్థానిక రాజకీయ సమీకరణల దృష్ట్యా, జనసేనలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. నిజానికి జనసేనలో పిల్లి చేరికపై, గత కొద్దిరోజులుగా తూర్పు గోదావరి జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించిన పిల్లి కుటుంబాన్ని జగన్ పట్టించుకోలేదు. ఇక తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య కూడా జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ, తెలంగాణ రాజకీయ కోణం నుంచి చూస్తే ఆయన.. టీడీపీ లేదా బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
అంబానీ కంపెనీకి చెందిన ఎంపి పరిమళ నత్వానీ సాంకేతికంగా వైసీపీలో ఉన్నప్పటికీ, ఆయన మనసు నిరంతరం బీజేపీలోనే ఉంటుందనేది బహిరంగం. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరడం ఖాయమంటున్నారు. ఇక నిరంజన్‌రెడ్డి, రఘునాధరెడ్డి, అయోధ్య రామిరెడ్డి అడుగులు కూడా బీజేపీ వైపేనంటున్నారు. వీరంతా జగన్‌కు బలమైన మద్దతుదారులు కావడం గమనార్హం.
అయితే.. తన వ్యాపార-రాజకీయ రక్షణ కోసం, వీరిలో కొందరిని స్వయంగా జగన్ బీజేపీలోకి పంపిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. నిజానికి జగన్ తొలుత.. తన పార్టీ ఎంపీలందరినీ గంపగత్తుగా బీజేపీలోకి పంపించే ప్రతిపాదన చేశారంటున్నారు. ఆ తర్వాత నెంబర్‌టూగా ఉన్న ఓ ఎంపి.. తానే అందరినీ బీజేపీలోకి తీసుకువస్తానని, తానైతే ఎలాంటి షరతులు పెట్టనని, అదే జగన్ అయితే రాజకీయ-వ్యాపార రక్షణకోసం అనేక షరతులు విధిస్తారని బీజేపీ నాయకత్వం వద్ద విశ్లేషించినట్లు, వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
దానితో బీజేపీ నాయకత్వం కూడా, ఆ నెంబర్ టూ ఎంపీ ప్రతిపాదనవైపే మొగ్గు చూపిందంటున్నారు. అయితే టీడీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్ టీడీపీ వైపు, తన జిల్లాలో ఎలాంటి బలం లేని బీజేపీలో చేరితే ఉపయోగం లేదని భావించిన పిల్లి సుభాష్ జనసేన వైపు, అదే కారణంతో గొల్లబాబూరావు టీడీపీ వైపు మొగ్గు చూపారన్న ప్రచారం జరుగుతోంది.
కాగా తన పార్టీలో నెంబర్ టూగా ఉన్న ఆ ఎంపి.. తన ఎంపీలను బీజేపీలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారం తెలుసుకున్న జగన్, ఆయనపై ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ తర్వాతనే ఒక మహిళా అధికారి వ్యవహారం బయటకొచ్చిందని, నిజానికి ఆ కథ తాడేపల్లి నుంచే నడిచిందన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తుంది. ఆ ఎంపీకి బీజేపీలో ప్రవేశం లేకుండా చేసేందుకే ఆ అనైతిక ఎపిసోడ్‌ను నడిపించారన్న ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా.. జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్‌పై అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాను ఇటీవల ఈవీఎంల పనితీరుపై ప్రారంభించిన యుద్ధానికి మద్దతునివాల్సిన జగన్, ఇప్పటిదాకా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ నుంచి ఆర్ధికంగా ఎలాంటి దన్ను లభించని బాలినేనికి.. ఇప్పటిదాకా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓడినప్పటికీ జిల్లాలో బలమైన వర్గం, అనుచరులున్న బాలినేని జనసేన ైవె పు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.