జగన్‌ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలు!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

పేర్లపాడు, మహానాడు: గడిచిన అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రైతులకు ఆత్మహత్యలు తప్ప ఒరిగిందేంటని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూటిగా ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వంలో ఏడాదికి 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆ పరిస్థితి మార్చాలనే ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బొల్లాపల్లి మండలం పేర్లపాడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. గ్రామ సమీపంలో సాగు చేస్తున్న మిరప పంటను పరిశీలించారు. డ్రోన్ ద్వారా మిరప పంటకు మందుల పిచికారీ చేశారు. ఎమ్మెల్యే జీవీ స్వయంగా డ్రోన్‌ను ఆపరేట్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ… చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, జలాశయాలు ఎండిపోతాయని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ సహా జలాశయాలన్ని జలకళతో ఉట్టిపడుతున్నాయన్నారు. దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు. పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తామని, రైతులంతా సంతోషంగా ఉంటారన్నారు. చంద్రబాబు మళ్లీ తిరిగి వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, యాంత్రీకరణ యంత్రాలు సహా అన్నింటిపై రాయితీలు ఇస్తున్నారన్నారు.

2014-19లో ఉద్యానవన శాఖ ద్వారా మొక్కలు ఇచ్చామని, ఉద్యాన పంటలను ప్రోత్సహించారని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తామని, ఎక్కడైనా అందకపోయినా, బ్లాక్ మార్కెట్ జరిగినా వెంటనే అధికారులతో పాటు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బ్లాక్ మార్కెట్‌లో అమ్మేవారి లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించారు. ప్రతి రైతు సంతోషంగా ఉండేలా గిట్టుబాటు ధర కూడా కల్పిస్తామన్నారు. జనసేన ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త నిశంకర్ శ్రీనివాసరావు, వివిధ శాఖల ప్రభుత్వాధికారులు, టీడీపీ నాయకులు జరపాల గోవింద నాయక్, పెమ్మసాని నాగేశ్వరరావు, టీప్పిశెట్టి వెంకటేశ్వర్లు, దాసరి కోటేశ్వర రావు,ఇంకా పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.