ముంబై నటిని వేధించిన ఐపిఎస్ లపై కేసు పెట్టి అరెస్టు చేయండి

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి

మనకు తెలియని మన చరిత్రల్లా ఐదేళ్ళ వైకాపా పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పటికీ వెలుగు చూస్తున్నాయని, ముంబై నటి పట్ల విజయవాడ లోని ఇద్దరు ఐపిఎస్ లు వ్యవహరించిన తీరు మహా దారుణం గా ఉందని తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వైకాపా నాయకుని ప్రేమ వ్యవహాన్ని పురస్కరించుకుని అప్పటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో నాటి విజయవాడ పోలీసు కమీషనర్ కాంతి రాణా ఠాణా, డిసిపి విశాల్ గున్నీ నేతృత్వంలో ఒక పోలీసు బృందం విమానంలో ముంబై వెళ్లి , అక్కడ నుంచి నటిని, ఆమె తల్లి దండ్రుల ను ఏపీకి తీసుకుని వచ్చి బెదిరించి, 18 రోజులు బంధించి, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపి, బెయిల్ మీద విడుదల చేసి, తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకొని పంపారని చెప్పారు.

ఈ సంఘటన ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో జరిగిందని, వైకాపా నాయకునితో ముంబై నటి ప్రేమ వ్యవహారం బయటికొస్తే, రాజకీయంగా వైకాపా పార్టీకి భారీ నష్టం ఉంటుందని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలతోనే సజ్జల గుట్టుచప్పుడు కాకుండా గూడుపుఠాని వ్యవహారాన్ని పూర్తి చేశారన్నారు. ఈ కేసులో మరో పెద్ద నేరం కూడా దాగుందని, బొంబే లోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కు నటిపై జరిపిన అత్యాచారం కేసును మాఫీ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశ్శీసులతోనే ఐపిఎస్ లు వ్యవహారాన్ని చక్కబెట్టి, ఆయనపై ఉన్న కేసును మాఫీ చేసేందుకు ఇలాంటి విద్రోహక చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఈ మొత్తం డీల్ లో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారాయని చెప్పారు. బాంబే నటిని బెదిరించి పంపారా? లేక ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను కాళ్ళపై కర్రలతో కొట్టినట్లు, ఆమెపై కూడా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి పంపారో కూడా అనుమానంగా ఉందన్నారు. అప్పట్లో వైసిపీ పోలీసులుగా పేరుగాంచిన వాళ్ళు చేయని అరాచకం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, మొత్తం వ్యవహారం పై విచారణ చేస్తే, పెద్ద తిమింగలాలు బయటికి వస్తాయని తెలిపారు. ముంబై నుంచి నటిని, తల్లిదండ్రులను తీసుకుని వచ్చి, మీడియాతో మాట్లాడిస్తేనే ఏం జరిగిందో తెలుస్తోందని పేర్కొన్నారు. రౌడీల్లా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తొత్తులుగా పని చేసిన ఐపిఎస్ లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నటుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మహిళగా హోం మంత్రి చొరవ తీసుకుని సజ్జల చీకటి బాగోతాన్ని, ముంబై నటి అంశాన్ని ప్రజలకు తెలియజేయాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.