అమిత్‌షా డీప్‌ ఫేక్‌ వీడియో కేసులో తొలి అరెస్ట్‌

`దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు
`అందులో నలుగురు తెలంగాణ
కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలు
`హైదరాబాద్‌ గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు
`రిజర్వేషన్ల అంశంపై తప్పుడు ప్రచారమే కారణం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మహానాడు : సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం, రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం, అమిత్‌షా డీప్‌ ఫేక్‌ వీడియోపై బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. అమిత్‌ షా డీప్‌ ఫేక్‌ వీడియో కేసులో రితోమ్‌ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బీజేపీపై తప్పుడు ప్రచారంపై దేశవ్యాప్తంగా మరో 10 మందికి నోటీసులు జారీ చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్‌ నాయకులు ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేశారని ఢిల్లీలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కారణమని పేర్కొన్నారు. కాగా నోటీసులు ఇచ్చిన 10 మందిలో నలుగురు తెలంగాణ వారు ఉన్నారు. ఢిల్లీ పోలీసులు సోమవారం ఉదయం కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ మన్నే సతీష్‌కు 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చారు. ఆయన లేకపోవడంతో టీపీసీసీ అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డికి నోటీసులు ఇవ్వగా వివరణకు 15 రోజులు గడువు కావాలని కోరారు.

మన్నె సతీష్‌తో పాటు నవీన్‌, శివకుమార్‌, తస్లీమాలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెక్షన్‌ 153(అల్లర్లు సృష్టించే ఉద్దేశం), 153ఏ (మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నంతో పాటు శత్రుత్వం పెంచే ప్రయత్నం), సెక్షన్‌ 465 (ఫోర్జరీ చేసినందుకు శిక్ష), సెక్షన్‌ 469 (ప్రతిష్టకు హాని కలిగించే ఉద్దేశంతో ఫోర్జరీ), 171జీ (ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు), సెక్షన్‌ 66సీ (చేసిన తప్పుకు శిక్ష అనుభవించడం), సెక్షన్‌ 505 (దుష్ప్రచారానికి దారితీసే ప్రకటనలు) కింద కేసులు నమోదు చేశారు.