– రేవంత్ గడ్డపై కేసీఆర్ షి‘కారు’
– సీఎం సొంత జిల్లాలోనే ఓడిన కాంగ్రెస్
– ఎమ్మెల్సీ ఎన్నికలో పరుగులు తీసిన కారు
– మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం
– బీఆర్‌ఎస్ అభ్యర్ధి నవీన్‌కుమార్‌రెడ్డి 111 ఓట్లతో గెలుపు
– కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్‌రెడ్డి ఓటమి
– తెలంగాణ అవతరణ దినం నాడే రేవంత్‌కు చేదు వార్త
– ఇన్చార్జిలను పెట్టినా గెలవని కాంగ్రెస్
– హేమాహేమీలున్నా ఫలితాల్లో షి‘కారు’
– బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను ప్రభావితం చేయలేని కాంగ్రెస్ నేతలు
– వ్యూహం ప్రకారం గెలిచిన బీఆర్‌ఎస్
– అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు తొలి ఓటమి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒకవైపు తెలంగాణ అవతరణ దినం అంగరంగవైభవంగా జరుగుతోంది. తెలంగాణ అమరుల త్యాగాలు, సమైక్యపాలనలో ఎదురైన కష్టాలను జ్ఞప్తికి తెచ్చుకుని, నవ తెలంగాణ కోసం పునరంకితం కావాలంటూ తెలంగాణ యువ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చిన సందర్భం. అదే సమయంలో.. ఆయన సొంత గ డ్డపై జరిగిన ఎన్నికలో బీఆర్‌ఎస్ జెండా ఎగిరిన వైనం. ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలో.. గతంలో నిలువెల్లా గాయాలతో క్షతగ్రాతురాలై ఉన్న బీఆర్‌ఎస్ మీసం మెలేసిన వైచిత్రి. అలా తెలంగాణ అవతరణ దినం రోజున ముఖ్యమంత్రి హోదాలో జెండా ఎగురవేసిన రేవంత్‌రెడ్డి.. ఇలా తన సొంత గడ్డపై విపక్ష బీఆర్‌ఎస్ ఎగురవేసిన విజయపతాకను కూడా ఏకకాలంలో చూడాల్సి రావడమే విశేషం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం మూటకట్టుకున్న బీఆర్‌ఎస్ మళ్లీ పుంజుకుంటోందా? కేసీఆర్‌కు పార్టీపై పట్టు అలాగే కొనసాగుతోందా? ప్రజాప్రతినిధులు ఇంకా నాయకత్వంపై తిరుగులేని నమ్మకంతో ఉన్నారా? అందుకే అధికార పార్టీ ఒత్తిళ్లను లెక్కచేయకుండా, ఇంత విషమ పరిస్థితిలోనూ వ్యూహాత్మకంగా తన పార్టీ అభ్యర్ధిని గెలిపించుకుని మీసం మెలేశారా? మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక విజయం ఇదే సంకేతం ఇస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. బీఆర్‌ఎస్ అభ్యర్ధి నవీన్‌కుమార్‌రెడ్డికి 763 ఓట్లు, అధికార కాంగ్రెస్ అభ్యర్ధి మన్నె జీవన్‌రెడ్డికి 652 ఓట్లు పోలయ్యాయి. 111 ఓట్లతో బీఆర్‌ఎస్ అభ్యర్ధి నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. అధికార కాంగ్రెస్ పార్టీ.. అంతకుమించి.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పార్టీ అభ్యర్ధి ఓడిపోవడం కాంగ్రెస్‌ను కుంగదీసింది.
స్థానిక ప్రజాప్రతినిధులపై.. కాంగ్రెస్ ఒత్తిళ్లు తీసుకువస్తుందని ఊహించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఎన్నికలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన పార్టీ ప్రజాప్రతినిధులు ప్రలోభాలకు గురికాకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించి, పార్టీ అభ్యర్ధిని విజయతీరాలకు చేర్చారు. సహజంగా అధికారంలో పార్టీ పెట్టే ప్రలోభాలకు లొంగిపోయే స్థానిక ప్రజాప్రతినిధులు.. ఇక్కడ మాత్రం కేసీఆర్ ఆదేశాలను పాటించడమే విశేషం.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌కు ఈ ఫలితం తొలి షాక్. శరాఘాతం లాంటి ఈ ఫలితాన్ని వ్యక్తిగతంగా సీఎం రేవంత్ జీర్ణించుకోవడం కష్టమే. పార్లమెంటు ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించే ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఓటమి ఎదురవడం నైతికంగా దెబ్బగానే భావించాలి. పైగా పార్టీ అభ్యర్ధి మన్నె జీవన్‌రెడ్డి గెలుపును, సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు, వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, సంపత్‌కుమార్, యెన్నం శ్రీనివాసరెడ్డి వంటి హేమాహేమలతోపాటు.. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షించిన ఎన్నికలో పార్టీ అభ్యర్ధి ఓడిపోవడం కాంగ్రెస్ శ్రేణులను దిగ్భ్రమపరిచింది. పైగా ఇతర రాష్ట్రాల్లో క్యాంపులు పెట్టినా, కాంగ్రెస్ తన అభ్యర్ధిని గెలిపించుకోలేకపోవడమే విశేషం. అటు కేసీఆర్ కూడా కాంగ్రెస్ అధికారబలాన్ని గ్రహించి, క్యాంపు రాజకీయాలతో తన పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకుని, నవీన్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకోగలిగారు.
ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమే అయినప్పటికీ.. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక ఫలితం రావడమే ఆశ్చర్యం. ఇది భవిష్యత్తులో రేవంత్‌రెడ్డి ఇమేజ్‌కు ప్రమాదమేనని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సొంత జిల్లాలోనే పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోలేని నేతగా, ఆయనపై ముద్రపడటం ప్రారంభమవుతుందని.. ఇది బీఆర్‌ఎస్‌కు అస్త్రంగా మారడంతోపాటు, సొంత పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గానికి కలసివచ్చే అంశంగా పరిణమిస్తుందంటున్నారు. ఒకవేళ పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు సాధించినప్పటికీ.. సీఎంగా రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో, ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోయారన్న విమర్శ మాత్రం స్థిరపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే రేవంత్‌రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్‌లో మాస్‌లీడర్‌గా కొనసాగుతున్నారు. ఆయన ఇమేజ్‌పైనే తెలంగాణలో, పార్టీ ఆధారపడిందన్న భావన బలంగా ఉంది. నాయకత్వం కూడా ఆయనకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పరిస్థితిలో రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాలో పార్టీని గెలిపించుకోలేకపోయారన్న అపప్రధ, ఆయన ఇమేజీకి డ్యామేజీనే అని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు.. పీకల్లోతు ఓటమి కష్టాల్లో ఉండి, సొంత పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతున్న క్లిష్ట సమయంలో, కేసీఆర్‌కు ఈ విజయం భారీ ఊరట మాత్రమే కాదు. ఆత్మస్థైర్యం పెంచే ఫలితమే. ఒకవేళ ఈ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి ఒకటి అరా సీట్లు వచ్చి నిరాశ చెందకుండా, మహబూబ్‌నగర్ విజయం టానిక్‌లా పనికొస్తుంది. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఆయన పార్టీని ఓడించటం, అటు బీఆర్‌ఎస్ గులాబీదండుకూ కిక్కు ఇచ్చే అంశమే. మొత్తంగా తెలంగాణ ఆవిర్భావదినం సందర్భంగా.. సీఎం రేవంత్‌రెడ్డికి ఖేదం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మోదం అన్నమాట.