వసతిగృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించి తీరాలి

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

వంకాయలపాడు, మహానాడు: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించి తీరాలని అధికారులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. నాణ్యమైన ఆహారంతో పాటు నెలరోజల్లోపు విద్యార్థుల హాస్టళ్లలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని స్పష్టం చేశారు. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల పదో తరగతి విద్యార్థులు గోడ దూకి పారిపోయిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. పారిపోవడానికి కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు నాణ్యమైన ఆహారం, మంచినీళ్లు సరిగా అందించడం లేదని, అన్నంలో పురుగులు ఉంటున్నాయని, మరుగుదొడ్లు శుభ్రం చేయడం లేదని ఎమ్మెల్యేతో సమస్యలు ఏకరవు పెట్టారు. బల్లలు, ఫర్నీచర్ లేదని, ఆటలు ఆడుకోవడానికి మైదానం కూడా లేదని, బోధన కూడా సక్రమంగా ఉండట్లేదని ప్రత్తిపాటికి వివరించారు. అన్నీ సావధానంగా ఉన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి నెలరోజుల్లో సమస్యలన్ని పరిష్కరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్‌ను హెచ్చరించారు.

విద్యార్థులకు అందిస్తున్న అన్నం, కూరలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ మెనూ పరంగా ప్రతిరోజూ విద్యార్థులకు అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లోనే ఉండి విద్యార్థుల సంరక్షణ చూడాలని సూచించారు. పాత ప్రభుత్వం వాసనలుంటే అధికారులు వెంటనే వదిలించుకోవాలని, భోజనం నుంచి బోధన, సౌకర్యాల వరకు ఎక్కడా లోటు రానివ్వకుండా హాస్టళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.