-పశువుల ఆరోగ్య పరిరక్షణకు డీ వార్మింగ్ క్యాంపులు
– వ్యవసాయ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు
అమరావతి: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ది మరియు మత్స్య శాఖ మంత్రిగా కింజరావు అచ్చెన్నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ లో ఆయనకు కేటాయించిన చాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణ, ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన మొత్తం ఆరు ఫైళ్లపై తొలి సంతకం చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర జిడిపిలో 35 శాతం వాటాను సమకూర్చే వ్యవసాయ అనుబంధ శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఆ శాఖలకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఖరీఫ్ లో నాలుగు మాసాలు రబీలో నాలుగు మాసాల పాటు పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
రైతులందరికీ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకారులకు జీవనాధారమైన చేపల చెరువులను గత ప్రభుత్వ లాక్కునేందుకు జీవో నెంబర్ 217 జారీ చేసిందని, ఆ జీఓ ను కూడా రద్దు చేస్తూ నేడు సంతకం చేయడం జరిగిందన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందజేసే డీజిల్ సబ్సిడీని గత ప్రభుత్వం నిలిపివేసిందని, ఆ రాయితీని మళ్లీ కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.10 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశువుల ఆరోగ్య పరిరక్షణకు డీ వార్మింగ్ క్యాంపులను రేపటి నుంచి నిర్వహిస్తున్నామన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని పశువులు ఉన్నాయని వివరాలు తెలుసుకునేందుకు పశు గణాంక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్జ్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ , రాష్ట్ర మత్స్య శాఖ కార్యదర్శి బాబు ఎ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎమ్.ఎమ్ నాయక్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరి కిరణ్ తడితర అదికారులతో పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రికి పుష్ప గుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.
 
								