Mahanaadu-Logo-PNG-Large

నెరవేరిన సీఎం హామీ.. ఇద్దరికి ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ

అమలాపురం, మహానాడు: వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందాయి. ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు1.5 లక్షలు. అమలాపురం కలెక్టరేట్ లో స్కూటర్లను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

కొత్తపేట మండలం వానపల్లి గ్రామ పంచాయతీ సంఘంపాలెం కు చెందిన ఇళ్ల భగవాన్(దివ్యాంగుడు), కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వర కిరణ్ కు వీటిని పంపిణీ చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. వీరిరువురికి జిల్లా రవాణా అధికారి ఆధ్వర్యంలో డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి సక్రమంగా డ్రైవింగ్ చేస్తున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత వారు కోరిన రంగు గల స్కూటర్లను అందజేశామన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు. కాగా, లబ్ధిదారులు తమపై దయతో అడగగానే ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇస్తామని హామీ ఇచ్చిన మరుసటిరోజే అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి వి.సత్యనారాయణ, జిల్లా రవాణా అధికారి అశోక్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.