వరద బాధితులకు బాసటగా నిలిచేలా నష్టం గణనతో పూర్తి స్ధాయి పరిహారం

-కేంద్ర బృందానికి విన్నవించిన విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా
-రెండు రోజుల పర్యటనలో భాగంగా విపత్తుల నిర్వహణ సంస్ధ సందర్శన
-ముఖ్య మంత్రి చంద్రబాబు నాయిడు నేతృత్వంలో వేగంగా వరద సహాయ చర్యలు
-అయా శాఖల వారీగా నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించిన ఉన్నతాధికారులు

బాధితులకు బాసటగా నిలిచేలా నష్టం గణనను పూర్తి చేసి వరద పీడితులకు పూర్తి స్దాయిలో న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా కేంద్ర బృందానికి విన్నవించారు. రాష్ట్రంలో వరద పరిస్థితిని అక్కడికక్కడే అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర నిపుణుల బృందం బుధవారం ఉదయం రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్ధను సందర్శించింది. కేంద్ర హోమ్ శాఖ సంయిక్త కార్యదర్శి అనిల్ సుబ్రమణ్యం, మహారాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ ఎఎల్ వఘ్ మర్, ఉపరితల రవాణా శాఖ చీఫ్ ఇంజనీర్ రాకేష్ కుమార్, ఆర్దిక శాఖ కన్సల్ టెంట్ ఆర్ బి కౌల్, గ్రామీణాభివృద్ది శాఖ ఉప కార్యదర్శి ప్రదీప్ కుమార్, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఎస్విఎస్పి శర్మ ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా వరద పరిస్దితి, నష్టం వివరాలకు సంబంధించిన సమగ్ర నివేదికను ఈ బృందానికి అందించారు.

తొలిదశ ప్రాధమిక అంచనాలను అనుసరించి రూ.6,882 కోట్లు నష్టం వాటిల్లిందని ఇది మరింత పెరిగే అవకాశం ఉందని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పునరావాసం కోసం రూ.750 కోట్లు వ్యయం అవుతాయన్న అంచనాలు ఉన్నాయని, గరిష్టంగా రహదారులు భవనాల శాఖకు రూ.2165 కోట్లు నష్టం వాటిల్లిందని, తురువాతి స్దానంలో రూ.1569 కోట్లతో నీటిపారుదల శాఖ, రూ.1160 కోట్లతో పట్టణాభివృధ్ది, పంచాయితీరాజ్ శాఖ ఉన్నాయన్నారు. పశుసంవర్ధక శాఖకు రూ.12కోట్లు, మత్స్య పరిశ్రమకు రూ.158 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, ఉద్యానవనశాఖకు రూ.40 కోట్లు, ఇంధన రంగానికి రూ.481 కోట్లు, గ్రామీణ నీటి పారుదల విభాగానికి రూ.76 కోట్లు, పంచాయితీ రాజ్ రహదారులకు రూ.168 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లినట్లు సిసోడియా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు నేతృత్వంలో వరద సహాయ చర్యలను వేగంగా అమలు చేసామని సిసోడియా కేంద్ర బృందానికి వివరించారు. వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రితో సహా, మంత్రులు, ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేసిన తీరును వివరించారు.

వరద ప్రభావిత ప్రాంత బాధితులకు కోటికి పైగా ఆహార ప్యాకెట్స్, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని, పెద్ద సంఖ్యలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సాయం అందించామన్నారు. వేలాది మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని, ఇళ్లలో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, గృహోపకరణాలను సిబ్బందితో మరమ్మత్తులు చేయిస్తున్నామని సిసోడియా కేంద్రబృందానికి వివరించారు. సమావేశంలో విద్యుత్త శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రహదారుల భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతీలాల్ దండే, పశుగణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్, విపత్తుల నిర్వ:హణ ప్రాధికార సంస్ధలో ప్రత్యేక విధులలో ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమీషనర్ శేషగరిబాబు, వ్యవసాయ శాఖ కమీషనర్ డిల్లీరావు, విపత్తుల నిర్వ:హణ ప్రాధికార సంస్ధ నిర్వహణా సంచాలకులు రోణంకి కూర్మనాధ్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తదితరులు అయా విభాగాల నష్టాలను గురించి వివరించారు. కృష్ణా జిల్లాలో జరిగిన వరద నష్టంకు సంబంధించిన ఛాయా చిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది.