పెద్దల పండుగకు ‘గాంధీ’ గండం

– ఇటు గాంధీ జయంతి.. అటు మహాలయ అమావాస్య

(ఏ.బాబు)

మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావిస్తారు. ఈ పక్షం రోజులు స్వర్గస్తులైనవారికి తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు శాంతస్తాయని భావిస్తారు.

అందుకే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పితృ పక్షాలకు ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి పెత్తర అమామాస్య(మహాలయ అమావాస్య) అక్టోబర్‌ 2వ తేదీన వచ్చింది. ఇదే రోజు గాంధీ జయంతి. పెద్దల పండుగ అంటేనే శక్తికొద్దీ మాంసాహారం, మద్యం ఉంటాయి.

స్వర్గస్తులైనవారికి అవి రెండూ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఇచ్చిన వారు పుచ్చుకుంటారు. ఈసారి గాంధీ జయంతి రోజు రావడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గాంధీ జయంతి రోజు ప్రభుత్వం మద్యం, మాంసం దుకాణాలు తెరవడానికి అనుమతి లేదు. దీంతో ఇప్పుడు పెద్దలకు మద్యం, మాంసం ఎలా అని ఆందోళన చెందుతున్నారు.

అనుమతికి డిమాండ్‌..

గాంధీ జయంతి రోజు మహాలయ అమావాస్య వస్తున్నందున.. ఈసారి మాంసం విక్రయాలకు అనమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు. పౌల్ట్రీ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ మాంసం విక్రయానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని భంగంపర్చడం సరికాదని పలువరు పేర్కొంటున్నారు. కొందరు మంగళవారం నిర్వహించుకోవాలని భావిస్తున్నారు. కొందరు గురువారం పాటించాలని భావిస్తున్నారు.

బుధవారమే చేయాలంటున్న పండితులు..

ఇదిలా ఉంటే.. మహాలయ అమావాస్యను బుధవారం రోజే పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఈరోజు పాటిస్తేనే స్వర్గస్తులైనవారి ఆత్మలు శాంతిస్తాయని పేర్కొంటున్నారు. ముందురోజు, లేదా తర్వాతి రోజు పాటించడం వలన ఎలాంటి ఫలితం ఉండదని పేర్కొంటున్నారు. దీంతో కొందరు బ్లాక్‌ దందాకు తెర తీస్తున్నారు. మద్యం అమ్మకాలు రహస్యంగా సాగించేందకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక మాంసం కూడా షాపుల్లో కాకుండా.. ఇళ్లలో విక్రయించేందుకు చికెన్, మటన్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. మహాలయ అమావాస్య నేపథ్యంలో అధికారులు యూడా చూసీ చూడనట్లు ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.