ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే స్థితి
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
శాంతి భద్రతల పరిస్థితి దారుణం
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా క్షీణించిందని, ఆడపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఇంకా చెప్పాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఈ 40 రోజుల్లో.. రోజూ మూడు హత్యలు, ఆరు రేప్‌లు అన్నట్లుగా పరిస్థితి మారిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కానీ స్పందించడం లేదని ఆమె ఆక్షేపించారు.
దాడులు, దౌర్జన్యాలు జరిగితే.. అక్కడ బాధితులపైనే కేసులు పెట్టడం, ఎక్కడికక్కడ వైయస్సార్‌సీపీ లేకుండా చేయాలన్న కుట్ర.. ఆ దిశలో దాడులు, ఆస్తుల విధ్వంసం.. కొన్ని చోట్ల ప్రాణాలు సైతం తీసే పరిస్థితి నెలకొందని వరుదు కళ్యాణి వెల్లడించారు.
రాష్ట్రంలో వరసగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలతో.. ఆడపిల్లలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 12 రోజులు గడిచినా చిన్నారి మృతదేహాన్ని కనిపెట్టలేక పోయారంటే ప్రభుత్వ చేతగానితనం అందరికీ అర్ధం అవుతోందని అన్నారు.
ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించడానికి ఇప్పటి వరకు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, చివరకు హోం మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ వెళ్లలేదంటే.. సామాన్య ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉందనేది అర్ధం అవుతోందని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.
ఆడపిల్లల రక్షణ అనేది మీ కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత లేని అంశమా? అని వరుదు కళ్యాణి నిలదీశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లాంటి వారు అంబానీ ఇంట పెళ్లికి వెళ్లారని, రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే వాళ్ల ఇంటికి పరామర్శకు వెళ్లాలని ఎందుకు అనిపించలేదని సూటిగా ప్రశ్నించారు.
హోం మంత్రి నియోజకవర్గంలో ఇద్దరు మహిళల బట్టలు చించిన టీడీపీ నాయకులు వారిని రోడ్డుపై ఈడ్చారని, అదే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయిని గొంతు కోసి చంపేశారని, ఆ చంపిన సురేష్ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్టయ్యి విడుదలైతే దర్శిని కుటుంబ సభ్యులు మూడుసార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. కనీసం అక్కడ పోలీసులు స్పందిచని పరిస్థితి ఉందన్నారు. దాన్ని అలుసుగా తీసుకుని ఆ దుర్మార్గుడు ఇంటికొచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అదే జిల్లాలో సన్మానానికి వెళ్లిన హోంమంత్రి అనిత.. ఈ బాధితురాలి పోస్టుమార్టం పక్కనే జరుగుతుంటే కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు.
జూన్ 4న కూటి గెలిస్తే, జూన్ 10న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మోదుకొండమ్మ జాతర సందర్భంగా అక్కడికి తల్లిదండ్రులతో వచ్చిన చిన్నారిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. జూన్ 21న చీరాల మండలం ఈపురుపాలెంలోని సీతారాంపురంలో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య జరిగిందన్నారు. అదేరోజు ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వరకు టాయిలెట్ కోసం వెళ్లిన యువతి ఎంత సేపటికీ రాకపోవడంతో కుటుంబీకులు వెతికితే రైల్వే ట్రాక్‌పై మృతదేహం కనిపించిందన్నారు.
జూన్ 27న విజయనగరంలో యువతిని ప్రేమించానంటూ వెంట పడిన ఓ ఉన్మాది. ఆ ప్రేమను అడ్డుకున్నారంటూ యువతి తండ్రిని దారుణంగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు. అదే జూన్ 27న అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం దివిటిపాలెంలో వివాహిత దారుణ హత్య. ఇంట్లో ఉన్న ఆమెను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసం హత్య చేశారు.
జూన్ 27న విజయవాడలోని ఓ మదర్సాలో 15 ఏళ్ల కరిష్మా అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి జూన్ 30న హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలోని కోటవురట్లలో ఇద్దరు మహిళలు లక్ష్మి అనే మహిళ, తన తోటి కోడలుపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేసి బట్టలు చించేస్తే ఎవరు బాధితులో వారిపైనే కేసులు పెట్టారని, అంత దారుణంగా కూటమి పరిపాలన, శాంతిభద్రతలు ఉన్నాయన్నారు.
హోం మంత్రి పక్క నియోజకవర్గం రాంబిల్లిలో దర్శిని అనే అమ్మాయిని చంపేస్తే, హత్య చేసిన సురేష్ అనే వ్యక్తిని వెతకడానికి 12 బృందాలను పెట్టామన్నారని, ఇంటి వెనకే 200 మీటర్ల దూరంలో సురేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని పడి ఉన్నాడన్నారు. అది కూడాపోలీసులు కనిపెట్టలేదని, ఆ ఊరి ప్రజలు చెబితే బాడీ దొరికిందన్నారు. కనీసం దర్శిని కుటుంబానికి ఆర్థిక సాయం, పరామర్శ కూడా చేయలేదన్నారు.
జూన్ 30న విశాఖ నగరంలోని మధురవాడ, అల్లయ్యపాలెంలో 5 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడి లైంగిక దాడి.
జూన్ 6న అనకాపల్లి రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయిని గొంతు కోసి చంపారు. జూన్ 7న నంద్యాల జిల్లా ముచ్చు మర్రిలో మైనర్ బాలికను హత్య చేసి నదిలో పడేసి 12 రోజులు గడిచినా ఈరోజుకూ నిందితులను పట్టుకోలేదు. జూన్ 12న గుంటూరు జిల్లాలో ఒకే రోజు రెండు సంఘటనలు. ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడులో 13 ఏళ్ల దళిత బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి. అలాగే ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య.
జూలై 15న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 12 ఏళ్ల దళిత బాలిక అనుమానాస్పద మృతి. ఆదోనిలో దళిత మహిళను పచ్చపార్టీ ఉన్మాదులు ట్రాక్టర్ తో గుద్ది చపేశారు. శ్రీకాకుళం జిల్లా బొడ్డుపల్లిలో రాజేశ్వరి అనే మహిళను ఆటో డ్రైవర్ హత్య చేశాడు.
విజయనగరం జిల్లా రామభద్రాపురంలో కేవలం 5 నెలల చిన్నారినిఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటే లోకం ఎటువైపు వెళ్తోంది? పోలీసు వ్యవస్థ ఏం పని చేస్తోంది? రాష్ట్రంలో శాంతిభద్రతలు పని చేస్తున్నాయా? అనే అనుమానం కలుగుతోందన్నారు. నిన్ననే విశాఖపట్నం ఉడా కాలనీ సమీపంలో శ్యామల అనే యువతిపై కత్తితో దాడి చేయడానికి దుర్మార్గుడు ప్రయత్నించాడు. తల్లి అడ్డు వస్తే ఆమెపై దాడి చేశాడు.