Mahanaadu-Logo-PNG-Large

ప్రధాన పతిపక్షనేత హోదా ఇవ్వండి.. ప్లీజ్

-మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సంప్రదాయాలకు విరుద్ధం
-ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు
-విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు
-ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు
-పార్లమెంటులోకాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకాని ఈ నిబంధన పాటించలేదు
-అధికారకూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వానికి ప్రదర్శిస్తున్నారు
-చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి.
-ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదు.
-అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది
-ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది
-ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నా
-అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి
-వైయస్.జగన్మోహన్ రెడ్డి లేఖ

అమరావతి: ఈనెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ్వీకారం చేయాలి.

కానీ అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిక్షనాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు.

ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ -1953 చట్టంలోని 12-Bలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించారు. విపక్షంలో ఉన్నపార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెప్తోంది.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకుని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైయస్సార్కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైయస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడంలో కాని, ఆపార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నాకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలోకాని, మీ ఉద్దేశాలేంటో బయటపడ్డాయి.

కానీ చట్టాన్ని చూస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోకాని, ఆపార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్షనేతగా స్పీకర్ గుర్తించడంలో ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. గౌరవ స్పీకర్ అన్న మాటలు యూట్యూబ్ ఛానళ్లలో పబ్లిష్ అయ్యాయి.

ఓడిపోయాడు కాని చావలేదు, చచ్చేవరకూ కొట్టాలి అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తంచేసింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైయస్సార్సీపీ 40శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇకవేళ ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడిచేస్తున్నట్టే అవుతుంది.

వైయస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారు. సభాకార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది.

ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో గణనీయమైన సీట్లు సాధించిన అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది కాని, వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.
అసెంబ్లీ సీట్లలో 10శాతం సీట్లు రానందున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శానసభాపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోంది.

ఆర్టికల్-208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో పలానా సీట్లు వస్తేనే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తుచేస్తున్నాను. 1984లో లోక్ సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది.

10 శాతం సీట్లు కాంగ్రెస్కు లేకపోయినప్పటికీ పి.జనార్దన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3సీట్లు సాధించినప్పటికీ ఆపార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు.
ఈ అంశాలన్నీకూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.

ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈలేఖ మీకు రాస్తున్నాను. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికే అధికార కూటమి శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణమీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యాబలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నాను