వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ఖమ్మం: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పుట్టెడు దుఃఖంతో ఉన్న ప్రజల్ని ఆదుకునేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టడంలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని వరద బాధితులు ఆక్రోశంతో ఉన్నారన్నారు.

ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి మున్నేరు వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సోమవారం మధ్యాహ్నం ఖమ్మం తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు.ఇటువంటి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు తమ బీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ప్రజల్ని కాపాడే వాళ్లమన్నారు.హెలికాప్టర్స్ ను వెంటనే రంగంలోకి దింపే వాళ్లమని, ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునే వాళ్లమని ఎంపీ రవిచంద్ర వివరించారు.

ముంపు ప్రాంతాలలో తిరిగినప్పుడు బాధితుల కష్టాలు, వారికి జరిగిన నష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో మున్నేరు ఉగ్రరూపం దాల్చిందని, గతేడాది వరద వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడడం జరిగిందన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా తదితర పెద్దలతో పాటు కలిసి వరద శాశ్వత నివారణకు కరకట్ట నిర్మాణానికి 690కోట్లు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు.