రతన్ టాటాను భారత ప్రభుత్వం గుర్తించాలి

– ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు

ఉండి, మహానాడు: ప్రపంచం గుర్తించి గౌరవించిన దిగ్గజ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాది, దార్శనికుడు, తన దాతృత్వంతో సమాజ హితానికి కృషిచేసిన రతన్ టాటా భారత ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణం రాజు సూచించారు. రతన్ టాటా సేవలను గుర్తించి గౌరవించడం ద్వారా ప్రపంచ దేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు మరింత ఇనుమడిస్తాయని పేర్కొన్నారు. రతన్ టాటా వంటి మహానుభావుడి మహాభినిష్క్రమణం నిజంగా దేశానికి, ప్రపంచానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

మరణించిన తర్వాత జీవించి ఉండే అతి కొద్ది మంది వ్యక్తులలో రతన్ టాటా ఒకరిని తెలిపారు. రతన్ టాటా భౌతికంగా లేకపోయినప్పటికీ, టాటా గ్రూప్ సంస్థలు జెఆర్ డి టాటా, రతన్ టాటా సిద్ధాంతాల ప్రకారమే నడుస్తాయన్నారు. ఎన్టీ రామారావు, రామోజీరావు, రతన్ టాటా లది మరణం లేని జననం అని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. జేఆర్డి టాటా చూపెట్టిన మార్గంలో పయనిస్తూ రతన్ టాటా ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఎన్నో గుప్త దానాలను చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రతన్ టాటా జీవించి ఉండగానే ఆయనకు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు ఇస్తారని ఆశించినట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రతన్ టాటా ను మూడుసార్లు కలుసుకుని అవకాశం తనకు లభించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అనేక రంగాలలో భారత పారిశ్రామిక పురోగతి కి టాటా సంస్థ దోహద పడిందన్నారు. ప్రపంచ దేశాల మానవాళి కోసం తన దాతృత్వం ద్వారా కృషిచేసి, అందరి మన్నలను పొందిన రతన్ టాటాకు, భారత ప్రభుత్వం ఎటువంటి నివాళులను అర్పిస్తుందో చూడాలన్న రఘురామ కృష్ణంరాజు, రతన్ టాటా మరణంతో ప్రతి ఒక్క భారతీయుడు బాధాతప్త హృదయంతో నివాళులర్పిస్తున్నారన్నారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.