– వైసీపీ ఐదేళ్లలో కరకట్టలను నిర్లక్ష్యం చేసింది
– పదేపదే హెచ్చరించినా వైసీపీ పాలకులు కరకట్టలను పట్టించుకోలేదు
– నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
– వరద ముంపు ప్రాంతాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని ప్రకటన
అవనిగడ్డ: వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంక, ఎడ్లంక, మోపిదేవి మండలం కే.కొత్తపాలెం గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి సూర్యనారాయణ పరిశీలించారు.
రామచంద్రపురం, అవనిగడ్డల్లో పునరావాస కేంద్రాలు పరిశీలించారు. మోపిదేవి మండలం కే.కొత్తపాలెంలో కృష్ణానది కరకట్టపై జనసేన పార్టీ కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తు వేళ మానవతా హృదయంతో స్పందించి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరూ అభినందనీయులన్నారు. కృష్ణానది వరదల ముంపు బారిన పడిన గ్రామాల్లో ప్రజలు కట్టుబట్టలతో మిగిలారని, సర్వం కృష్ణార్పణమై వరద బాధితులు పూర్తిగా నష్టపోయారన్నారు. అనేక పూరి గుడిసెలు పడిపోవడంతో పాటు ఇళ్లకు నష్టం వాటిల్లిందన్నారు.