విపక్షం గొంతు నొక్కడమే పనిగా ప్రభుత్వం

– జోగి రాజీవ్‌ను విజయవాడలో ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా, అన్నీ మర్చిపోయిన టీడీపీ కూటమి ప్రభుత్వం, విపక్షం గొంతు నొక్కడం, కక్ష సాధింపు లక్ష్యంగా పని చేస్తోందని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌పై కక్ష తీర్చుకోవడానికి అతడి కుమారుణ్ని టార్గెట్‌ చేయడం దారుణం అని ఆయన అన్నారు.

గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి గొప్పగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్‌ అమలు కోసం అంతా ఎదురుచూస్తున్నారని, అయితే వాటిని అమలు చేయని ప్రభుత్వం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం బీసీలు టార్గెట్‌గా ఇవన్నీ చేస్తోందని ఆయన ఆక్షేపించారు. బలహీనవర్గాల్లో ఎదిగిన నాయకులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బలహీన వర్గాలను అణచి వేయడం ద్వారా అసలు ఎలాంటి లబ్ది పొందాలనుకుంటున్నారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ నిలదీశారు.