Mahanaadu-Logo-PNG-Large

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే వెంకట్రావు

గన్నవరం, మహానాడు: రాష్ట్ర అభివృద్ధితోపాటు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ను గురువారం ఉదయం గన్నవరం రైతు బజార్లో ఆయన ప్రారంభించి ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర ధరలు అదుపులో ఉండేవని, గత ప్రభుత్వ హయాంలో అన్ని ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్నంటాయన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఉల్లిపాయ, టమోటా ధరలు గణనీయంగా పెరిగినపుడు రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే ఉల్లిపాయలు, టమోటా అందించి వినియోగదారులకు ఉశమనం కలిగించిన సంగతి గుర్తు చేశారు.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బియ్యం కందిపప్పు ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం మిల్లర్లతో మాట్లాడి పౌరసరఫరాల శాఖ ద్వారా కేజీ రూ.55.85 ఉన్న బియ్యాన్ని రూ.49లకు, కందిపప్పు బహిరంగ మార్కెట్లో కేజీ రూ.181 ఉండగా రూ.160లకే రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఇదే రీతిగా బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగిన ప్రతిసారి తెలుగుదేశం ప్రభుత్వం స్పందించి వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందించి ఉపశమనం కలిగించిందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక ధరలు ఆకాశాన్నిండటంతో ఉన్న నిర్మాణ రంగం కుదేలైందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల అటు లబ్దిదారులకు మేలు కలగడంతోపాటు నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండిటికీ ప్రాధాన్యతనిస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

నిత్యావసర ధరలు తగ్గించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఈ సందర్భంగా వెంకట్రవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు, కోటగిరి వరప్రసాద్, దయాల రాజేశ్వరరావు, జాస్తి వెంకటేశ్వరరావు, ఫణి, పొట్లూరి ప్రసాద్, మద్దినేని వెంకటేశ్వరరావు, పడమట రంగారావు తదితర నాయకులు, అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.