– సీఎం నారా చంద్రబాబు నాయుడు
– వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చర్చించిన ముఖ్యమంత్రి
అమరావతి : అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చంద్రబాబు చర్చించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు.
వికసిత్ భారత్ -2047 కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై నీతి ఆయోగ్ తో చర్చించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కోసం విజన్ ప్రణాళికపై నీతి ఆయోగ్ సీఈవో, ప్రతినిధులు, నిపుణులతో సీఎం సమావేశం అయ్యారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తన గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్ ఆలోచనలను నీతి ఆయోగ్ తో పంచుకున్నారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఏపీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘‘ప్రభుత్వాలు విజన్ తో పనిచేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు, విజన్ తో వచ్చిన ఫలితాలు మనం చూశాం. నేడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలి. వినూత్న ఆలోచనతో, టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించాలి. అందుకు అనుగుణంగా వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ విజన్ 2047 సిద్ధం చేయాలి. జనాభా సమతుల్యతపై లోతైన కసరత్తు చేసి ప్రణాళిక సిద్ధం చేయాలి.
రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో అన్ని రంగాల్లో విప్తవాత్మక మార్పులు వస్తాయి. అమరావతి, వైజాగ్ ఎఐ హబ్స్ గా రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలి. రాష్ట్రంలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రతి సామాన్యుడికీ ఫలాలు అందాలి…..రాష్ట్ర స్థాయి నుంచి మండల, కుటుంబ స్థాయి వరకు ఒక యునిట్ గా ప్రణాళికలు రచించాలి. అప్పుడే విజన్ డాక్యుమెంట్ కు సార్థకత చేకూరుతుంది.
వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటు, ప్రకృతికి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలి. సీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారు. రాష్ట్ర ప్రగతిలో కీలకమైన విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయి…వాటికి అనుగుణంగా వ్యవస్థలను, ప్రజలను సిద్ధం చేయాలి. మానవ వనరుల విషయంలో నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలి. దీని కోసం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సిలబస్ రూపొందించాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
కొత్త టెక్నాలజీని, అవకాశాలను అందిపుచ్చుకునే విధానాలు విజన్ డాక్యుమెంట్ లో ఉండాలన్నారు. సంపద సృష్టికి దోహదపడే పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఐఐటి, ఐఐఎం, ఐ.ఎస్.బీ వంటి సంస్థలు, మేధావులు, నిపుణులతో చర్చించి డాక్యుమెంట్ సిద్ధం చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మారుమూల గ్రామంలో ఉన్న సామాన్య వ్యక్తికి కూడా ఫలితాలు అందేలా విజన్ ఉండాలని సిఎం అన్నారు.
రానున్న రోజుల్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పై మరిన్ని సమావేశాలు, సమాలోచనలు జరిపి…దాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి భావించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.