– ఆక్వా రంగంలో వైరస్ ను ఆహార కాలుష్యాన్ని నివారించే ప్రాజెక్టు ఏర్పాటుకు తొలి అడుగు
– కోస్తా జిల్లాల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన అమెరికా కంపెనీ
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి: 26-09-2024: లక్షలాదిమంది ఆక్వా రైతులను వైరస్ బారి నుంచి కాపాడటం, ఆహార కాలుష్యాన్ని నివారించే నిమిత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్టార్టప్ ను కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తొలి అడుగులు పడ్డాయి.
అమెరికాకు చెందిన సైబస్ బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఈరోజు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చాంబర్ నుంచి అమెరికాలో ఉన్న మంత్రితో వర్చువల్ గా సమావేశమయ్యారు. సైబస్ బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రతిపాదన మేరకు కోస్తా ప్రాంతంలో ఆ సంస్థను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి తెలియజేశారు.
ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన చర్చలో లక్షలాదిమంది ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన వాతావరణ కాలుష్యం, వైరస్ ప్రభావము, ఆహార కాలుష్యాన్ని ఈ టెక్నాలజీ ద్వారా నివారించి అక్వా రంగం ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ఆక్వా హెచ్చరీలు, ఫిష్ పాండ్ల స్థాయిలోనే వైరస్ ను నివారించవచ్చని, ప్రస్తుతం ఒకచోట వైరస్ సోకితే ఆ ప్రాంతమంతా వైరస్ బారిన పడి ఆక్వా రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ టెక్నాలజీ ద్వారా ప్రాథమిక స్థాయిలోనే వైరస్ ను నివారించవచ్చని దీనివల్ల కోట్లాది రూపాయల విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుందని తెలిపారు. సైబస్ బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సీక్ లేబరేటరీస్ అనే స్టార్టప్ కంపెనీ యు యస్ ఏ లోని సాల్ట్ లేక్ సిటీలో ఉందని, వీరి ప్రయోగాలు విజయవంతమై వాటిపై పేటియం సైతం పొందినట్లు సైబర్స్ టెక్నాలజీ ప్రతినిధులు తెలియజేశారు.
దేశంలోనే అత్యంత విదేశీ మారకద్రవ్యాన్ని అర్జిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతంలో వీరి ద్వారా ఈ టెక్నాలజీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే లక్షలాది మంది ఆక్వా రైతులకు లాభం చేకూరుతుందని, తద్వారా వేల కోట్ల రూపాయల విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని వారు తెలియజేశారు.
దీనిపై స్పందించిన మంత్రి తాను అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై సమగ్రంగా అధ్యయనం చేసి, వీరికి అవసరమైన చోట రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు చేస్తామని తద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులను ఆదుకునేందుకు ముందడుగు పడుతుందని రాష్ట్ర, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
లక్షలాది మంది ఆక్వా రైతులను ఆదాయాల బాట నడిపించే ఈ ప్రాజెక్టుకు పెద్ద పేట వేస్తామని మంత్రి తెలిపారు. ఈ వర్చువల్ సమావేశంలో అమెరికా నుంచి మంత్రి శ్రీనివాస్ పాల్గొనగా, సైబస్ బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఆ సంస్థ డైరెక్టర్లు రవీంద్రనాథ్ కోలనుకుదురు, అనంత్ నగేష్, రమేష్ వెంకటరామన్, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ క్రైగ్ విలియం మోసమాన్, టెక్నికల్ డైరెక్టర్ మడిసేన్ పైపర్ తోపాటు మంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.