* అంతరాలయంలో శ్రీదుర్గమ్మ తల్లి వీడియోగ్రఫీ చేస్తే కఠిన చర్య
* రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ
* ధూప దీప నైవేద్యాలకి ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు
* రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరణ
– రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
అమరావతి, మహానాడు: గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద జరిగే జల హారతులను పునఃప్రారంభించనున్నట్టు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గమ్మ తల్లి అంతరాలయంలో వీడియోగ్రఫీ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపుచేస్తున్నామన్నారు. రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారని, రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవాదాయ భూముల పరిరక్షణకు సహకరించాలన ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సచివాలయంలో వారికి కేటాయించిన ఛాంబరు ఆధునీకరణ అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం ఛాంబరులోకి ప్రవేశించారు. ఆ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు పుష్పగచ్చాలు అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. సీటులో ఆసీనులైన తర్వాత రెండు ముఖ్యమైన ఫైళ్లపై మంత్రి తొలి సంతకం చేశారు. ఇందులో ఒకటి రూ.113 కోట్ల సి.జి.ఎఫ్. నిధులతో రాష్ట్రంలోని 160 దేవాలయాల ఆధునీకరణ పనులకు సంబందించినది కాగా, మరొకటి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నున్న శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని రూ 1.00 కోటి సి.జి.ఎఫ్. నిధులతో ఆధునీకరించే పనులకు సంబంధించినది. ఈ 160 దేవాలయాల్లో 147 ప్రాధాన్యత దేవాలయాలు మైదాన ప్రాంతాల్లోవి కాగా మిగిలిన 13 దేవాలయాలు వెనుకబడిన, గిరిజన ప్రాంతాలోనివి.
ఈ సందర్బంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం అడుగుల వేస్తోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా, భక్తులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండే విధంగా, భగవంతుని ఆస్తులను పరిరక్షించే విధంగా ఎల్లప్పుడు సంసిద్దులుగా ఉండటమే తమ ప్రథమ బాధ్యత, కర్తవ్యం అన్నారు.
గత ప్రభుత్వ పాలనలలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి వరకూ దేముని ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియా ముఖంగా వెలువడిన పరిస్థితి అందరికీ తెలుసన్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని చర్యలు చేపట్టాల్సిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ తామ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎటు వంటి ఆరోపణవచ్చినా సరే వెంటనే నివేదికలు తెప్పించుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టబోయేముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తదుపరి ఈ తిరుమల నుండే ప్రక్షాళన మొదలు పెడతాం అని చెప్పిన విధంగా దేవాదాయ శాఖ ప్రక్షాళనను కూడా తిరుమలే నుండే ప్రారంభించడం జరిగిందన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తెలుసుకున్న అంశాలు మరియు ప్రజాగళం, యువగళం కార్యక్రమంలో వచ్చిన వినతులకు అనుగుణంగా దేవాదాయ శాఖ తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
దేవాదాయ శాఖ ఆధీనంలో మొత్తం 27,105 దేవాలయాలు ఉన్నాయని, వీటిలో 6(ఎ) ఆలయాలు 236 ఉన్నట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా ఈ శాఖ పరిధిలో మొత్తం 4,65,000 ఎకరాల భూమి ఉందని, ఆ భూమి ఏ మాత్రం అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 20,839 మంది సిబ్బంది ఉన్నారని, వారిలో మత పరంగా 11,142 మంది, పాలనా పరంగా 9,697 మంది పనిచేస్తున్నారన్నారు. మొత్తం 1,234 ట్రస్టు బోర్డులు ఉన్నాయని, వీటిలో పలు కారణాల వల్ల కొన్ని ఖాళీగా ఉన్నాయని, మరో 462 నూత బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
గత ప్రభుత్వం హారతులు ఇచ్చే పవిత్ర కార్యక్రమాన్ని నిలిపివేసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు మళ్లీ ఆ హారతుల కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకై సోమవారం రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులతో కూడిన మంత్రుల బృందం సమావేశమై హారతులు ఇచ్చే కార్యక్రమంపై తగు చర్యలు తీసుకుంటుదన్నారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దుర్గమ్మతల్లి మూల విరాట్ ను ఈ నెల ఏడో తేదీన ఒక వ్యక్తి వీడియోగ్రఫీ చేసినట్టు, సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఒక మీడియా ఛానల్లో ప్రసారం అయిందని, సాధారణంగా ఏ ఆలయంలో అయినా అంతరాలయంలోని మూల విరాట్ ను అర్చకులు తప్ప మరెవ్వరూ తాకకూడదు, అంతరాలయంలోని వెళ్ల కూడదు మంత్రి అన్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ విచారణ జరిపించి నివేదికతో పాటు సీసీ ఫుట్టేజీలను విజయవాడలోని పోలీస్ కమిషనర్ కు తగు చర్యకై అందజేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 27,105 దేవాలయాలు ఉన్నాయని, ఆ దేవాలయాల అంతరాలయంల్లోని మూల విరాట్ ను పిక్చరైజ్ చేయవద్దని, ఎవరూ తాకవద్దని విజ్ఞప్తి చేస్తూ అందుకు విరుద్దంగా ప్రవర్తించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మంత్రి హెచ్చరించారు.
దేవాదాయ శాఖ పరిధిలో 50 వేల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు గతంలో ప్రతి నెలా రూ.5 వేలు ఇస్తుంటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దాన్ని రూ.10 వేలకు పెంచుతూ ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపడం జరిగిందని, త్వరలోనే జి.ఓ. కూడా జారీచేయడం జరుగుతుందన్నారు. ఫలితంగా ప్రతి ఏడాది దాదాపు రూ.32 కోట్లు అదనపు భారం దేవాదాయ శాఖ మీద పడుతుందని అంచనా వేయడం జరిగిందన్నారు.
రెవిన్యూ శాఖ పరంగా ప్రజలకు ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో రెవిన్యూ సదస్సులను ఆగస్టు 15 న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అన్ని రెవిన్యూ గ్రామాల్లో ఈ సదస్సులను నిర్వహించనున్నట్టు తెలిపారు. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్, డిప్యుటీ కమిషనర్ రతన్ రాజు తదితర అధికారులతో పాటు పలువురు అనధికారులు, మంత్రి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.