Mahanaadu-Logo-PNG-Large

కమ్మవారికి శ్రమ కొత్తకాదు

-ఇప్పటి విజయంతో ఇంకా బాధ్యత పెరిగింది
-ఈ చారిత్రాత్మక విజయం ఒక కులం వల్ల రాలేదు
-సమిష్టి కృషివల్ల లభించింది
-అతిగా ప్రవర్తిస్తే అనర్ధదాయకం
-గెలుపును ఆస్వాదించడంలో తప్పులేదు

కమ్మ సోదరులకు వినమ్ర పూర్వక విజ్ఞప్తి ఎన్నికల ఫలితాలు వచ్చి నిండా 24 గం.లు గడవక ముందే ఎ.పి ఎన్నికల్లో విజయం సాధించామని కమ్మ సామాజిక వర్గం పేరున వచ్చిన పోస్ట్ ను చూసి అశ్చర్య పోయాను. కానీ నేటికీ ఇంకా కొత్తవి వస్తూనే వున్నాయి. అసలు కమ్మ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు ఎ.పి లో. 5-6 % కమ్మ సామాజిక వర్గ ఓటర్లు లేని మంగళగిరిలో లోకేష్ కు 91 వేల మెజారిటీ వచ్చిందీ అంటే అది కమ్మవారి గొప్పతనమా ?

శ్రీ భరత్, పెమ్మసాని చంద్రశేఖర్ కు లక్షల్లో మెజారిటీ వచ్చింది అంటే కమ్మవారి ఓట్లవల్ల వచ్చిందని అందామా ? కమ్మవారు పోరాటం చేసింది పార్టీలతో , వ్యక్తులతో గానీ కులాలతో కాదు. టి.డి.పి వేరు కమ్మ సామాజిక వర్గం వేరు. రెండింటికీ మధ్య ఉన్న గీతను చెరిపేస్తున్నారు కొందరు. ఇతర సినీ నటుల అభిమానులు టి.డి.పి ఓటర్లు కాకూడదా ?

అలాగే టి.డి.పి కార్యకర్తలు అనేక నటులకు అభిమానంగా ఉండ కూడదా ? అభిమానం వేరు , పార్టీ వేరు. 50 % ఓట్లు దాటి టి.డి.పి కూటమికి వచ్చా యంటే ఒక్క కమ్మవారి ఓట్ల వల్లే సాధ్యమయ్యిందా ? గతంలో గ్రామ గ్రామాన వ్యవసాయ ఆధారితంగా అభివృద్ధి చెందామూ అంటే అన్ని కులాలు సహకరించాయి కాబట్టే, కమ్మజాతి వృద్ధిలోకి వచ్చింది. తమజాతిని వృద్ధిలోకి తీసుకు రావడమే కాక ఇతర కులస్తులకు చేదోడు , వాదోడుగా నిలిచి అందరితో మమేకమై తాము వృద్ధి చెందిందే కాకుండా తోటి కులస్తులకు చేయూతనిచ్చిన జాతి కమ్మజాతి.

కానీ నేడు నగరీకరణ వల్ల గ్రామాల్లో సాయంచేసిన వ్యవసాయాన్ని వదలి నగర బాట పట్టి సమాజంతో వేరుపడ్డాం. దీన్నే కొన్ని కుక్కమూతి రాజకీయ పార్టీలు పేదలకు – పెత్తందార్లకు యుద్ధం అని కమ్మ వారిని సమాజం నుండి వేరు చేయడానికి ప్రయత్నించారు. కానీ విజ్ఞతతో ఆలోచించిన ఆంధ్రా ప్రజానీకం, వారిని తమ ఓట్లతో మట్టికరిపించింది. ఏ ప్రాంతం చూసినా , ఏ నియోజక వర్గం చూసినా వేలాది ఓట్ల మెజారిటీ లభించడం సాధారణ విషయం కాదు.

ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసిన ఆంధ్రా ప్రజానీకం నుండి, కమ్మ సామాజిక వర్గాన్ని వేరు చేయకండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఒక్క చేతితో చప్పుడు రాదు. ఇప్పటి విజయంతో ఇంకా భాద్యత పెరిగింది. ఈ రోజు దక్కిన చారిత్రాత్మక విజయం ఒక కులం వల్ల రాలేదు. సమిష్టి కృషివల్ల లభించింది. విజయాన్ని ఏ ఒక్క కులానికో ఆపాదించడం తగదు. తిరుగు లేని విజయం సాధించామని విర్రవీగితే కాలగర్భంలో కలసి పోతున్న , కలిసిపోయిన నాయ కుల చరిత్రను ఒకసారి పరిశీలించండి.

వసుధా మానవుడు సంఘజీవి. ఒకరి కొకరు సహాయం తీసుకోవడం తప్పనిసరి. వీలయితే సాయం చెయ్యండి . ఏ సహాయం చేయకపోయినా పర్వాలేదు గానీ , ఎదుటి వ్యక్తిని కించపరచేటట్లు వ్యవహరిస్తే ఛీ కొట్టించుకోవల్సి వస్తుంది. సమాజంలో కొన్ని కులాల పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందులో కమ్మ సామాజిక వర్గం ఒకటి. దాన్ని చెడగొట్టుకోకుండా , ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి.

ప్రమాదాలు , సమస్యలు చెప్పి రావు. వచ్చే అవకాశం వుందని ఊహించ గలగాలి. దానికి బద్దులమై నడచుకోవాలి. అతిగా ప్రవర్తిస్తే అనర్ధదాయకం. కాలం మారుతోంది. ప్రజల ఆలోచనలు , ప్రాధాన్యతలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు మా గ్రామానికి రోడ్డు వెయ్యమనో, మంచినీటి ట్యాంకు నిర్మించమనో కోరే వారు. ఇప్పుడు అవన్నీ సమకూరాయి. ఆహార భద్రతతో తిండికి ఇబ్బంది లేకుండా ఉంది. గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి.

ఇక్కడే ప్రజల ప్రాధాన్యతలు మారుతున్నాయి. శ్రమను నిదానంగా తగ్గిస్తున్నారు. ఉచితాలకు ఎదురు చూస్తున్నారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవడం లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా బ్యాంకు ఖాతాలో ఉచితంగా ఏమేమి వచ్చి పడతాయో చూసుకుంటున్నారు. ఎప్పుడైతే తిండికి , నివాసానికి ఇబ్బంది లేదో మనిషి పక్క చూపులు చూస్తాడు. కులం , మతం , వర్గం , ప్రాంత భావనలు చుట్టు ముడతాయి. దానితో సమాజం చీలిపోతుంది.

ఇప్పటి ఈ విజయం లాంటి పరిస్థితి ఎప్పుడో గానీ ఒకసారి వస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తెలుగుజాతిని సమున్నత స్థానంలో ప్రపంచానికి పరిచయం చేయాలి. అందులో కమ్మవారి పాత్ర చిరస్థాయిగా నిలిచి ఉండే విధంగా కమ్మవారు శ్రమించాలి. శ్రమ కమ్మవారికి కొత్తకాదు. కానీ గ్రామాలకు దూరంగా జరిగిన కొంతమంది కమ్మవారు కొన్ని సందర్భాలలో అతిగా ప్రవర్తిస్తున్నారు.

వారి అత్యుత్సాహాన్ని ప్రశ్నించడం కాదు గానీ , అది వారికి తెలిసో, తెలియకో చేస్తుండవచ్చు. గెలుపును ఆస్వాదించడంలో తప్పులేదు. 12 వ తేదీ బాబుగారు ప్రమాణ స్వీకారంతో ఒక అంకం పూర్తవుతుంది. ఎవరి దారికి వారు సర్దు కుంటారు. కానీ గ్రామాల్లో వుంటే కమ్మవారిపై వత్తిడి పెరుగుతుంది. వీరిని ఎలా అణగదొక్కాలా అని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయి.

పొత్తులో ఉన్న పార్టీల విచ్ఛిన్నానికి కుట్రలు , కుతంత్రాలు పన్నుతాయి. కులాల , మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు శతవిధాలా 360 డిగ్రీల్లో ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇల్లు అలకగానే పండగ కాదు. జాగరూకతో పరిస్థితిని గమనిస్తూ తాము అభివృద్ధి చెందుతూ , ఇతరులను కూడా ముందుకు తీసుకు వెళ్లవలసి బాధ్యత కమ్మ సమాజంపై ఉంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనేది తెలుగు సామెత.

ప్రతిపక్షం లేనంతగా విజయం దక్కింది కాబట్టి ఇంకా ఇంకా బాధ్యతతో మెలగాలి. ఇప్పటికే కొన్ని చోట్ల హింసకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఐదు సం.లుగా అనేక ఇబ్బందులు పడి ఉండవచ్చు. ప్రతీకారానికి అనేక మార్గాలు ఉన్నాయి. హింసను ఎన్నుకుంటే వై.సి.పి కి మనకీ తేడా ఏముంది ? బలవంతంగా లాక్కున్న ఆస్తులను ఎలా వెనక్కు పొందాలో , అక్రమ కేసుల నుండి ఎలా బైటపడాలో ముందు ఆలోచించండి.

అహంకారం తోటి విర్రవీగితే వై.సి.పి , బి.ఆర్.ఎస్ లకు పట్టినగతే కమ్మవారికి , టి.డి.పి కి పడుతుంది. చరిత్రను తిరగ రాయడంలో కమ్మవారు ఎప్పుడూ ముందుంటారు , సమాజం ముందుకు సాగే ప్రతి మలుపు లోనూ కమ్మవారి పాత్ర ఉంటుంది. వసుధా శ్రమించి , వ్యవసాయం ఆధారంగా వృద్ధి లోకి వచ్చిన కమ్మజనులకు పేదల కష్టాలు, కడగండ్లు తెలుసును. అందుకే వేరొకరికి చేయి అందించి సాయం చేయడం కమ్మ సమాజానికి మొదటినుండీ అలవాటుగా మారింది.

నమ్మితే కమ్మవారినే నమ్మాలిరా , అనే నానుడి అందుకే వచ్చింది. అదే రాజకీయంలోనూ ప్రవేశించింది. అనాలోచితంగా , ఆవేశంతో , బాధ్యతా రాహిత్యంగా కొందరు కొన్ని పోస్ట్ లు పెట్టడం వల్ల సమాజంలో కమ్మవారి పట్ల ద్వేష భావం పెరగడానికి , విజృంభించ డానికి అవతలి వారికి అదొక ఆయుధంగా ఉపయోగ పడుతోంది. అలా వారికి అవకాశం ఇవ్వకుండా , యువ కమ్మవారు పెట్టే ప్రతి పోస్ట్ కమ్మవారి గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి.

మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు , మన చర్యల ద్వారా, చేష్టల ద్వారా, ప్రవర్తన ద్వారా అంతా మెచ్చుకునే విధంగా ఉండాలి. నగరాల నుండి , విదేశాల నుండి తరలి వచ్చి ఓటింగ్ చేయడమే కాక , ఆర్థికంగా కూడా సహకరించి, కొత్త శక్తిని ఇనుమడింప చేసిన మాట వాస్తవం. దానికి అంతా సంతోషించారు. కానీ వచ్చినవారు తిరిగి వెళ్ళక తప్పదు కదా ? గ్రామాల్లో వుండే కమ్మవారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. గ్రామాల్లో మిగిలి ఉన్న వ్యవసాయ దారులైన కమ్మవారు , ముసలి తరం వారు ఇబ్బందులు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనమీదే వుంది.

పట్టణ , నగర , విదేశీ వాసులైన యువ కమ్మ సోదరులు ఆవేశంతో పెడుతున్న కొన్ని పోస్టుల వల్ల గ్రామాలలో ఉంటున్న కమ్మవారిపై వత్తిడి పెరిగి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వడ్డున కూర్చున్న వారు, గ్రామాలకు వెలుపుల వుండే వారు ఎన్ని కబుర్లయినా చెబుతారు. పడేవాడికి తెలుస్తుంది బాధ. ఆవేశంతో రెచ్చగొట్టగుండా , రెచ్చిపోకుండా , వివేకంతో , ఆలోచనతో పనులను సాధించుకోవాలి. కావున సోదరులు , పెద్దలైన కమ్మవారు మరింత జాగరూకతో తమ అస్తిత్వాన్ని కాపాడుకునే దిశలో యువ కమ్మ సోదరులకు దిశా నిర్దేశం చేస్తారని ఆశిస్తూ …

– వల్లూరుపల్లి ఎల్. ప్రసాద్