వర్షాలు పడినపుడు ఫిజికల్ పోలీసింగ్ ఉండేలా చర్యలు
55 కి.మీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు
లండన్ ఐ లాంటి టవర్ ను మిరాలం చెరువులో నిర్మిస్తాం
గతంలో పాన్ డబ్బాలో గంజాయి దొరికే పరిస్థితి
80 వేల పుస్తకాల నాలెడ్జ్ తో మీరు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయింది
– అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: చారిత్రక కట్టడాలతో హైదరాబాద్ అద్భుత నగరంగా విలసిల్లింది. నగరం విస్తరిస్తోంది.రాబోయే వందేళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాను ఏర్పాటు చేస్తున్నాం.నగరంలో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణలను నియంత్రించే బాధ్యత కూడా హైడ్రా తీసుకోనుంది.
గతంలో గంటకు 2సెం.మీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ డిజైన్ చేశారు. వాతావరణ మార్పులతో కుంభవృష్టి కురుస్తే వరదలు వస్తున్నాయి. సమస్యల శాశ్వత పరిష్కారానికి హైడ్రాను ఏర్పాటుచేస్తున్నాం. నాళాలు ఆక్రమణ చేయాలంటేనే గుండెల్లో గుబులు పుట్టాలి. అలాంటి వ్యవస్థను తీసుకు వస్తాం.
హైదరాబాద్ నగర ప్రజల ఇబ్బందులు తొలగించాలని ప్రణాళికలు రచిస్తున్నాం. హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ 1965లో మంజీరా జలాలు, 1982 సింగూరు జలాలు, 2004 లో కృష్ణా ఫెజ్-1, 2008 కృష్ణా ఫెజ్-2 ద్వారా కాంగ్రెస్ తాగు నీరు అందించింది. 2014లో కృష్ణా ఫెజ్-3 90శాతం పనులు కాంగ్రెస్ పూర్తి చేసింది. కానీ 2015 లో తామే తెచ్చినట్లు టీఆరెస్ నేతలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తామే చేసినట్లు చెప్పుకున్నారు.
భిన్నాభిప్రాయాలున్నా చంద్రబాబు, వైఎస్ ఆర్ నగరం అభివృద్ధికి కృషి చేశారు. ఒక మంచి ప్రణాళికతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. అత్యధిక వర్షాలు పడినపుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా హార్వెస్టింగ్ వెల్ డిజైన్ చేయాలని మేం అధికారులకు సూచించాం. 141 ప్రాంతాలను గుర్తించి డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాం. వర్షాలు పడినపుడు ఫిజికల్ పోలీసింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నాం..
బీఆరెస్ నేతలు మాట్లాడితే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆరెస్ పాలనలో సింగరేణి కాలనీలో గంజాయి మత్తులో ఆడబిడ్డను రేప్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. దిశ అత్యాచార ఘటనలో ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించ లేదు. మొయినాబాద్ దగ్గర టీఆరెస్ నాయకుడు రేప్, మర్డర్ చేస్తే చర్యలు శూన్యం. వాళ్ల హయాంలో ఇంత జరిగితే అబద్ధాల ప్రాతిపదికన మాపై ప్రాపగండా చేస్తున్నారు.
గతంలో పాన్ డబ్బాలో గంజాయి దొరికే పరిస్థితి.. ఇవాళ గంజాయి అమ్మలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం.. గొప్ప ఆలోచనతో సమాజానికి విస్తృత సేవలు అందించేందుకు హైడ్రాను తీసుకొచ్చాం. నగరానికి అధ్బుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 55 కి.మీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టనున్నాం.లక్ష 50వేల కోట్లకు అంచనాలు పెంచారని కెటీఆర్ అంటుండు..
మీ హయాంలో కాళేశ్వరం కడితిరి.. కూలిపోయింది.కానీ మేం పని మొదలు పెట్టకముందే ఆయన డీపీఆర్ అడుగుతున్నారు. ఎందుకు… కాంట్రాక్టర్లతో మాట్లాడుకుని కమీషన్లు దండుకునేందుకా? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచాం. మూసీ రివర్ ఫ్రంట్ లో ఆక్రమణలను గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నాం.త్వరలోనే సాంకేతిక నిపుణులతో కూడిన కన్సల్టెంట్ ను నియమిస్తాం..
మేం ఏమీ 80వేల పుస్తకాలు చదివినం అని చెప్పుకోవడంలేదు. 80 వేల పుస్తకాల నాలెడ్జ్ తో మీరు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయింది. అప్పుడే ఏదో జరిగిపోయినట్టు ఎందుకు వాళ్లకు ఇంత బాధ. పదేళ్లు వాళ్లు పరిపాలించారు. పది నెలలు కాకముందే మాపై ఎందుకింత ఆక్రోశం? 200 సంవత్సరాలు ఏలిన నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తలొగ్గారు.పదేళ్లు ఏలిన మీరెంత? ప్రజల ఆమోదం ఉంటే నాయకులు అవుతారు తప్ప, ఎదుటి వారిని అవహేళన చేస్తే కాదు.
మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ కు నీళ్లు ఇచ్చామని చెబుతున్న కేటీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వచ్చే నీటినే మధ్యలో పైప్ లైన్ ద్వారా గజ్వేల్ కు అందించారు. నీ గజ్వేల్ కు ఇచ్చే నీళ్లు కూడా కాంగ్రెస్ తెచ్చిన ప్రాజెక్టు నుంచి ఇచ్చినవే.హైదరాబాద్ నగర అభివృద్ధికి అందరి సలహాలు తీసుకోవాలన్నదే మా ఆలోచన.మిరాలం చెరువుపై 2.6కి.మీ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తాం. లండన్ ఐ లాంటి టవర్ ను మిరాలం చెరువులో నిర్మిస్తాం.
నిజమైన హైదరాబాద్ నిజమైన అభివృద్ధికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది..
గత ప్రభుత్వం వారి విలాసవంతమైన జీవితం కోసం ప్రగతి భవన్, ఆఫీసు కోసం సచివాలయం నిర్మించింది తప్ప ప్రజల కోసం వాళ్లు చేసిందేం లేదు. సచివాలయంలో ఉన్న ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. వాళ్ల సెంటిమెంట్ కోసం ప్రజల సెంటిమెంట్ ను ఫణంగా పెడితే ఏమైంది? దిక్కులేని పరిస్థితి వచ్చింది.
రాష్ట్ర అభివృద్ధికి కలసి పనిచేద్దామని చెప్పినా కిషన్ రెడ్డి ముందుకు రాలేదు. ఆయన పాత మిత్రుడికి కోపం వస్తుందని ముందుకు రావడంలేదేమో?
బీజేపీ ఎమ్మెల్యేలు అంతా కలిసి రండి.. మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధులను తెచ్చుకుందాం. రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం.