– హర్యానాలో బీజేపీ హ్యా‘ట్రిక్’
– కాంగ్రెస్ కూటమి ఖాతాలో జమ్ము కాశ్మీర్
– జమ్ములో బీజేపీ హవా
– హర్యానాలో ఫలించని ఎగ్జిట్‌పోల్స్ జోస్యం
– కాంగ్రెస్ కూటమి ఖాతాలో మరో రాష్ట్రం
– ఎన్నికల ఫలితాల్లో చెరో రాష్ట్రం పంచుకున్న రెండు కూటములు
( మహానాడు ప్రధాన ప్రతినిధి)
హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ, ఇండి కూటమి చెరో రాష్ట్రంలో విజయం సాధించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఎన్నికలు, బీజేపీకి నిరాశ కలిగించాయి. అయితే జమ్ము కాశ్మీర్‌లో బీజేపీ అతిపెద్ద రెండవ పార్టీగా అవతరించింది.
ప్రధానంగా జమ్ము ప్రాంతంలో బీజేపీ తిరుగులేని పట్టు సాధించింది. అక్కడ 43 స్థానాల్లో బీజేపీ 29 స్థానాలు సాధించగా, కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితయింది. ఇక కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం ఇండి కూటమి పైచేయి సాధించడంతో ఆ రాష్ట్రాన్ని ఇండి కూటమి చేజిక్కించుకోగలిగింది.
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించగా, జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. బీజేపీ వరుసగా మూడోసారి హర్యానా పీఠం చేజిక్కించుకుంది. మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో గెలుపొందింది. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 46 కాగా, బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. 37 స్థానాలకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ మరోసారి విపక్ష హోదాతో సరిపెట్టుకుంది.
ఐఎన్ఎల్ డీ 2, ఇతరులు 3 స్థానాలు దక్కించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.
నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి 48 చోట్ల విజయం సాధించింది. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచాయి. అయితే బీజేపీ సొంతంగా 29 స్థానాల్లో విజయం సాధించింది. పీడీపీ 3, జేపీసీ 1, సీపీఐ (ఎం) 1, ఆప్ 1, ఇతరులు 7 స్థానాలు దక్కించుకున్నారు. కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా పేరు ఖరారయింది.