Mahanaadu-Logo-PNG-Large

కోరిక తీర్చాలని బెదిరించాడు

– టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై చంద్రబాబుకు బాధితురాలి లేఖ
– పోలీసులకు ఫిర్యాదు
– ఆ వీడియో మార్ఫింగ్: ఎమ్మెల్యే ఆదిమూలం

సత్యవేడు: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలు సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది.ఎమ్మెల్యే ఆదిమూలం తనని వేధించాడని, తన కోరిక తీర్చాలంటూ బెదిరించాడంటూ లేఖలో తెలిపింది. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసిన వాట్సప్ స్క్రీన్ షాట్లను కూడా ఆమె బయటపెట్టింది.

ఆదిమూలం వైసీపీలో ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేశానని కక్ష్యగట్టి, ఇప్పుడు టీడీపీలోకి వచ్చాక తనపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా బాధితురాలు లేఖలో వెల్లడించింది. ఆర్థరాత్రులు కూడా ఫోన్ చేసి తనను టార్చర్ చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

దీనిపై తన భర్త తనను నిలదీయగా విషయం మొత్తం చెప్పానని.. తన భర్త ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాసలీలలకు సంబంధించిన వీడియోలను రికార్డు చేసినట్లుగా బాధితురాలు లేఖలో వెల్లడించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని ఎమ్మెల్యే ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంది.

మరోవైపు ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తనని లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. అయితే ఈ వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. టీడీపీ నాయకులే తనపై కుట్ర చేశారంటూ ఆరోపించారు. ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోందని తెలిపారు. తానేంటో తన నియోజకవర్గ ప్రజలకు తెలుసునని చెప్పారు.