– ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు
వేమూరు, మహానాడు: వరద బాధితులకు అధికార యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు అందిస్తున్నామని మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలిపారు. లంక గ్రామాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను అధికారులు, నాయకులతో కలిసి ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో ఎక్కువ వరద వచ్చిందని, 11 లక్షల క్యూసెక్కుల పైన నీరు కిందకి విడుదల చేశారన్నారు. వేమూరు నియోజకవర్గానికి సంబంధించి కొల్లూరు, భట్టిప్రోలు మండల పరిధిలో లంక గ్రామాలు దాదాపు 20 గ్రామాలు నీట మునిగిన పరిస్థితి ఉందన్నారు.
అధికారులతో సమన్వయం చేసుకొని వారిని పునారవాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వారికి కావలసిన నిత్యవసర సరుకులు, ఆహారం, మంచినీరు అందిస్తున్నట్టు తెలిపారు. దాదాపుగా 40 పడవలను అందుబాటులో ఉంచాం… ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా కూడా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం… అన్ని శాఖలను సమన్వయపరచుకొని సహాయ కార్యక్రమాలు అందిస్తామని తెలిపారు. ప్రజలు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేతోపాటు బాపట్ల కలెక్టర్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.