ఇవిగో మీ భూదందా ఆధారాలు…

సీబీఐ, సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించండి
ఆరోపణలు రుజువు చేయలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధం
జవహర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన పీతల మూర్తి
మూడుసార్లు రహస్యంగా విశాఖకు ఎందుకొచ్చారు?
మీ కుమారుడి నేతృత్వంలో అగ్రిమెంట్లు కుదుర్చుకోలేదా?
రైతులకు ప్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు ఇచ్చింది నిజం కాదా?
వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిపివేయగలరా?
మీడియా ముందు కలెక్టర్‌ ఇచ్చిన ఆధారాలతో వెల్లడి

విశాఖపట్నం :  సీఎస్‌ జవహర్‌రెడ్డిపై భూ దందా ఆరోపణలు చేసిన జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆదివారం అందుకు సంబంధించిన ఆధారాలు మీడియా ముందు బయటపెట్టారు. ఉత్తరాంధ్రలో తనకు, తన కుటుంబసభ్యులకు భూములు లేవని సీఎస్‌ జవహర్‌రెడ్డి చెబుతున్నారని, ఆయనకు భోగాపురం, పూసపాటిరేగలో భూములు ఉన్నాయని తెలిపారు. అందుకు సంబంధించి కలెక్టర్‌ ఇచ్చిన ఆధారాలను బయటపెట్టారు. తన దగ్గర ఇంకా పూర్తి ఆధారాలున్నాయని, పేద రైతుల అసైన్డ్‌ భూములను వైసీపీ ప్రభుత్వం దోచుకుందని తెలిపారు. దీని కోసం ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తెచ్చింది. రైతులకు ఇచ్చిన భూములు వారి పేరునే ఉన్నాయా? అని ప్రశ్నించారు. సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సీఎస్‌ను డిమాండ్‌ చేశారు. సిట్టింగ్‌ జడ్జికి లేదా సీబీఐకి పూర్తి వివరాలు ఇస్తా. నా ఆరోపణలు రుజువు చేయలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.

జవహర్‌రెడ్డి కుమారుడి నేతృత్వంలో అగ్రిమెంట్లు

సీఎస్‌ జవహర్‌రెడ్డి కుమారుడి నేతృత్వంలో పేదల అసైన్డ్‌ భూములు అగ్రిమెంట్లు చేసుకున్నారు. జీవో వచ్చాక ఆఘమేఘాలపై రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ నెల 9న అప్పన్న స్వామి దర్శనానికి సీఎస్‌ జవహర్‌రెడ్డి ఎందుకు రహస్యంగా వచ్చా రు? దర్శనం తర్వాత సీఎస్‌ ఎక్కడెక్కడకు వెళ్లారు? ఆయన వెంట ఎవరెవరు అధి కారులు ఉన్నారు? రాష్ట్రంలో పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియ జరుగుతుంటే సీఎస్‌ భోగాపురం ఎందుకు వచ్చారు? విశాఖకు రహస్యంగా 3 సార్లు ఎందుకు వచ్చా రు? ఆనందపురం, భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో అగ్రిమెంట్లు కుదుర్చుకుని రైతులకు ప్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సీఎస్‌ జవహర్‌ రెడ్డి భూములకు సంబంధించి నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. ప్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన రైతుల వద్ద భూమి ఉందా? ప్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జవహర్‌రెడ్డి నిలిపేయగలరా? నేను చేస్తున్న ఆరోపణల పై ఆయన సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.